ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం భీకరంగా జరుగుతోంది. హమాస్ వరుస దాడులతో ఇజ్రాయెల్ లో పరిస్థితులు భయాంకరంగా మారాయి. హమాస్‌ మిలిటెంట్ల దాడులను తిప్పి కొట్టేందుకు వివాదాస్పద గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ సేనలు ప్రతిదాడులు కొనసాగిస్తున్నాయి. దాదాపు 18 వేల మందికి పైగా భారతీయులు ఇజ్రాయెల్‌లోని వివిధ పట్టణాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కొందరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే సమయంలో హైవేలపైనే చిక్కుకుపోయారు. దీంతో వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇజ్రాయెల్‌లోని వృద్ధుల సంరక్షణ కోసం పలు ఏజెన్సీలు భారత్‌ నుంచి వందలాది మందిని నియమించుకుంటాయి. భారత్‌ నుంచి అక్కడికి వెళ్లిన వారిలో వీళ్లే ఎక్కువగా ఉంటారు.


ఇజ్రాయెల్ లో చిక్కుకున్న ఎంపీ వాన్‌వేయ్‌రాయ్‌ ఖార్లుఖీ 
తాజా పరిస్థితుల నేపథ్యంలో జెరుసలేంలోని భారత రాయబార కార్యాలయం, అక్కడి భారతీయులను అప్రమత్తం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని సూచించింది. రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని కోరింది. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్నవారిలో భారత్‌ రాజ్యసభ ఎంపీ వాన్‌వేయ్‌రాయ్‌ ఖార్లుఖీ ఇజ్రాయెల్‌లో చిక్కుకున్నారు. మేఘాలయ నుంచి నేషనల్ పీపుల్స్‌ పార్టీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన జెరూసలేం వెళ్లారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్లు దాడి చేయడంతో బెత్లహమ్‌లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారు. ఎంపీ కుటుంబంతోపాటు మరో 24 మంది భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం. వాళ్లందర్నీ ఈజిప్ట్‌ తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


స్వదేశానికి తీసుకొస్తాం
మరోవైపు ఇజ్రాయెల్‌లో కొనసాగుతున్న యుద్ధ పరిణామాలను ప్రధానమంత్రి కార్యాలయం నిశితంగా గమనిస్తోందన్నారు కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి. అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ప్రధాన మంత్రి, ఆయన కార్యాలయ సిబ్బంది అక్కడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఆ దేశంలో చిక్కుకుపోయిన మన విద్యార్థులను తీసుకురావడానికి  ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. 


గతంలో తీసుకొచ్చాం
గతంలోనూ విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని ప్రత్యేక ఆపరేషన్ ద్వారా స్వదేశానికి తీసుకొచ్చిన విషయాన్ని మీనాక్షి లేఖి గుర్తు చేశారు. ఆపరేషన్‌ గంగ, వందేభారత్‌ తదితర ఆపరేషన్లు చేపట్టి ప్రతి ఒక్కరినీ సురక్షితంగా స్వదేశానికి  తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం, ప్రధాన మంత్రి కార్యాలయం ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న విద్యార్థులతో నేరుగా టచ్‌లో ఉందని, ఎప్పటికప్పుడు పరిస్థితిని కచ్చితంగా తెలుసుకుంటోందని తెలిపారు. 


ఇజ్రాయెల్‌పై హమాస్‌ రాకెట్‌ దాడులను ఆపడం లేదు. తాజాగా స్డెరోట్‌ నగరంపై ఏకంగా 100 రాకెట్లను ప్రయోగించారు. ఈ దాడుల్లో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు నిన్న జరిపిన దాడిలో హమాస్‌ ఎంత మంది ఇజ్రాయెలీలను బందీలుగా పట్టుకుందో గుర్తించేందుకు ఐడీఎఫ్‌ ప్రత్యేకంగా సిచ్యూవేషన్‌ రూమ్‌ను ఏర్పాటు చేశాయి. హమాస్‌ గన్‌మెన్లు నిన్న భారీగా పిల్లలు, మహిళలు, పురుషులను ఈడ్చుకొని గాజాపట్టీలోకి తీసుకెళ్లారు. ఇప్పటికే ఇజ్రాయెల్‌ రక్షణ దళాలకు సుమారు ఎంత మంది బందీలుగా ఉన్న అంశంపై కొంత అవగాహన ఉంది. కచ్చితమైన సమాచారం తెలుసుకోవాలని భావిస్తోందని ఐడీఎఫ్‌. గాజాపట్టీలో భవిష్యత్తులో తీవ్రమైన దాడులు జరుగుతాయని ఆయన హెచ్చరించారు. ఇందులో భాగంగానే గాజా సమీపంలోని ఇజ్రాయెల్‌ వాసుల నివాస ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు.