ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నేటి (ఆదివారం) నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది వీటిని ఆన్‌లైన్‌కు బదులుగా ఆఫ్‌లైన్‌ విధానంలో చేపడుతున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని పేర్కొన్నారు. ఏ కాలేజీలో కూడా అనుమతి లేకుండా అదనపు సెక్షన్లలో అడ్మిషన్లు చేపట్టడానికి వీల్లేదని.. అలా చేస్తే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బైపీసీ, ఎంపీసీలు మాత్రమే కాకుండా.. బోర్డు రూపొందించిన కాంబినేషన్లలోని (సీఈసీ, హెచ్‌ఈసీ తదితర) సెక్షన్లన్నింటిలో కూడా ప్రవేశాలు చేపట్టాలని తెలిపారు. 


ప్రవేశాల షెడ్యూల్‌ ఇదే..
దరఖాస్తుల అమ్మకం: సెప్టెంబర్‌ 19 (నేడు) నుంచి
దరఖాస్తుల స్వీకరణ తుది గడువు: సెప్టెంబర్‌ 28 
అడ్మిషన్ల ముగింపు: సెప్టెంబర్‌ 28 
తరగతుల ప్రారంభం: సెప్టెంబర్‌ 29


సర్టిఫికెట్లను ఉంచుకోరాదు..
అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు విద్యార్థుల మార్కుల మెమోల ఆధారంగా విద్యార్థులకు ప్రొవిజినల్‌ ప్రవేశాలు కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్సెస్సీ (SSC) సర్టిఫికెట్లు, స్కూల్‌ టీసీలు వచ్చాక ఆ ప్రవేశాలను ధ్రువీకరించాలని తెలిపారు. ఎస్సెస్సీ, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లను పరిశీలించాక వాటిని విద్యార్థులకు ఇచ్చేయాలని చెప్పారు. ఏ విద్యా సంస్థ కూడా వాటిని తన వద్ద ఉంచుకోరాదని స్పష్టం చేశారు. సర్టిఫికెట్లను విద్యార్థులకు తిరిగి ఇవ్వకుండా తమ వద్దే ఉంచుకునే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


రిజర్వేషన్ల ప్రకారమే కేటాయింపు..
సీట్ల కేటాయింపు విషయంలో కులం, మతం, ప్రాంతం తదితర కారణాలతో ఏ ఒక్క విద్యార్థికి కూడా అడ్మిషన్లు నిరాకరించరాదని బోర్డు కార్యదర్శి ఉత్తర్వుల్లో తెలిపారు. సీట్లను రిజర్వేషన్‌ కోటా మేరకు ఆయా వర్గాల విద్యార్థులతో భర్తీ చేయాల్సిందేనని పేర్కొన్నారు. ఇలా చేయని సంస్థల గుర్తింపు రద్దు సహ ఇతర చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బాలికేతర కాలేజీల్లోని అన్ని కేటగిరీ సీట్లలో బాలికలకు 33.33 శాతం కేటాయించాలని పేర్కొన్నారు. 


తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను ఫస్టియర్‌లో మాత్రమే చేర్చుకోవాలని పేర్కొన్నారు. అక్కడ ఇంటర్ ఫస్టియర్‌ చదివిన వారికి ఏపీలో సెకండియర్‌లో నేరుగా ప్రవేశాలకు అనుమతించబోమని తెలిపారు. ఆయా రాష్ట్రాల ఇంటర్‌ సిలబస్, ఏపీ ఇంటర్‌ సిలబస్‌లో వ్యత్యాసాలు ఉండటంతో ఇతరులు ఏపీలోని జూనియర్‌ కాలేజీల్లో నేరుగా సెకండియర్‌లో ప్రవేశించడానికి అనర్హులని స్పష్టంచేశారు.


తొలుత ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలను ఆన్‌లైన్‌ విధానంలో చేపట్టాలని బోర్డు నిర్ణయించింది. దీనికి సంబంధించి చర్యలు కూడా ప్రారంభించింది. అయితే బోర్డు నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇంటర్ ప్రవేశాలకు ఆన్‌లైన్‌ విధానాన్ని నిలిపివేస్తున్నట్లు హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ ఏడాది ఆన్‌లైన్‌ విధానంలో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లను పూర్తిచేయాలని బోర్డును ఆదేశించింది. 


Also Read: AP EDCET 2021: 21న ఏపీ ఎడ్‌సెట్‌.. 24 నుంచి పీఈసెట్.. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ డైరెక్ట్ లింక్‌లు ఇవే..


Also Read: IGNOU July 2021: ఇంటి నుంచే డిగ్రీ, పీజీ చేయాలనుకుంటున్నారా? 'ఇగ్నో' గోల్డెన్ ఛాన్స్ ఇస్తుంది..