దూర విద్య విధానంలో చదవాలనుకునే వారికి ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్‌లైన్ డిస్టెన్స్ లెర్నింగ్, ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లు, అనేక ఇతర కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జూలై సెషన్‌కు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 23 వరకు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సహా మరిన్ని వివరాల కోసం ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ ignou.ac.inను సంప్రదించవచ్చని అభ్యర్థులకు సూచించింది. దీని ద్వారా బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు, అవేర్‌నెస్ డిగ్రీ ప్రోగాం సహా పలు కోర్సుల్లో చేరవచ్చు. యూజీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు నిర్దేశించిన గడువును ఇప్పటికే పలుమార్లు పొడిగించగా.. తాజాగా మరోసారి పెంచింది.
ప్రవేశ పరీక్ష లేకుండానే ఇగ్నోలో ఎంబీఏ..
దూరవిద్య ద్వారా ఎంబీఏ కోర్సులో చేరాలనుకునే వారికి ఇగ్నో శుభవార్త అందించింది. ఇకపై ప్రవేశపరీక్ష మార్కులతో సంబంధం లేకుండా నేరుగా ఎంబీఏ కోర్సులో చేరవచ్చని తెలిపింది. ఇప్పటివరకు ఇగ్నో ఎంబీఏ కోర్సులో చేరాలంటే ‘ఓపెన్ మ్యాట్’ ప్రవేశ పరీక్షను నిర్వహించేవారు. ఇప్పుడు పరీక్ష లేకుండా డిగ్రీ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించనున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 30లోగా ignouadmission.samarth.edu.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇగ్నో హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్ ఫయాజ్ అహ్మద్ వెల్లడించారు.
ఇగ్నోలో కొత్తగా రెండు కోర్సులు..
ఇగ్నోలో ఈసారి కొత్తగా రెండు మేనేజ్మెంట్ కోర్సులు ప్రారంభం కానున్నాయి. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (MBF) అనే రెండు కొత్త కోర్సులను ఇగ్నో ప్రారంభించింది. ఈ రెండు కోర్సులను ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఎంబీఏ కోర్సులో చేరేందుకు జనరల్ విద్యార్థులు డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. రిజర్వ్‌డ్ కోటా అభ్యర్థులైతే 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఈ రెండు కోర్సులకు సంబంధించిన విద్యార్హత, దరఖాస్తు గడువు, ఫీజు వంటి కీలక వివరాల కోసం ఇగ్నో అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని అభ్యర్థులకు సూచించింది.
Also Read: SDLCE (KU): ఇంటి వద్ద ఉండి చదవాలనుకుంటున్నారా.. కాకతీయ యూనివర్సిటీ మీకో గోల్డెన్ ఛాన్స్ ఇస్తుంది..
Also Read: Career Guidance: 2021లో డిమాండ్ ఉన్న 5 కోర్సులు ఇవే.. వీటిలో మీకేం కావాలో ఎంచుకోండి..