AP School Education : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ఫ్లస్‌గా మార్పు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. హైస్కూల్ ప్లస్ పాఠశాలలను బాలికలకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైస్కూల్ ప్లస్ స్కూల్స్ లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీలలో రెండు కోర్సులు మాత్రమే అందించనున్నట్లు తెలిపింది. స్థానికంగా ఉన్న డిమాండ్‌తో కోర్సులు నిర్థారించాలని సంబంధిత శాఖ ఆదేశించింది. పీజీటీ సమానస్థాయి అధ్యాపకులను హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో బోధనకు తీసుకోనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 1752 స్కూల్ అసిస్టెంట్లను 292 జూనియర్ కళాశాలల్లో పనిచేసేందుకు నియమిస్తున్నట్లు తెలిపింది. ఆ పాఠశాలల్లో నాడు-నేడు పనులు చేసిన కారణంగా అదనపు తరగతి గదులను మంజూరు చేయమబోమని ప్రభుత్వం పేర్కొంది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
అకడమిక్ కేలండర్ విడుదల
ఈ విద్యాసంవత్సరం పాఠశాలలు జులై 5 ప్రారంభమై ఏడాది ఏప్రిల్ 29వ తేదీ వరకు కొనసాగుతుందని విద్యాశాఖ ప్రకటించింది. జులై 4వ తేదీన పాఠశాలలు తెరవాలని భావించారు. కానీ జులై 4 ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉండడంతో ఒక రోజు ఆలస్యంగా పాఠశాలలు తిరిగి ప్రారంభించారు. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 220 రోజులు పాఠశాలలు పనిచేయనున్నాయి. 80 రోజులు సెలవులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. ఏపీ అకడమిక్ కేలండర్ ను రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(SCERT) ప్రకటించింది. 1 నుంచి 9 తరగతులకు సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగుస్తాయని వెల్లడించింది. ఈ ఏడాది విద్యార్థులకు సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబరు 6వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయని తెలిపింది. క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబరు 1 నుంచి 6వ తేదీ వరకు ఇస్తారు. సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు ప్రకటించింది.
ఈ ఏడాది పరీక్షలకు సంబంధించి తాత్కాలిక షెడ్యూలును ఎస్సీఈఆర్టీ ప్రకటించింది. సెప్టెంబరులో ఫార్మేటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షలు, అక్టోబర్ లో ఫార్మేటివ్-2 పరీక్షలు, నవంబర్, డిసెంబరులో సమ్మేటివ్-1, వచ్చే ఏడాది జనవరిలో ఫార్మేటివ్-3 పరీక్షలు, ఫిబ్రవరిలో ఫార్మేటివ్-4 పరీక్షలు, పదో తరగతి ప్రీ ఫైనల్ ఫిబ్రవరి 22 నుంచి ఉంటాయని తెలిపింది. సమ్మేటివ్ 2 పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొంది. జీవో 117లో పాఠశాలలను 6 రకాలుగా వర్గీకరించింది. పాఠశాలల ప్రారంభం నాటికి ప్రాంగణాన్ని శుభ్రం చేయించడం, తరగతి గదులను అలంకరించడం లాంటివి చేయాలని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. పాత పుస్తకాలను సేకరించి బుక్ బ్యాంకు ఏర్పాటు చేయాలని తెలిపింది.