➥ మార్చి 18 నుంచి రిజిస్ట్రేషన్లు
➥ ప్రైవేటు పాఠశాలల్లో 25% కోటాలో సీట్లు పొందే విద్యార్థులకు వర్తింపు
➥ 'అమ్మఒడి' సాయం కిందే ఫీజుల చెల్లింపు
ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత, నిర్భంధ విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టం కింద రాష్ట్రంలోని ప్రైవేటు అన్‌ఎయిడెడ్ స్కూళ్లలో 2023–24 విద్యాసంవత్సరానికి ఒకటో తరగతిలో అర్హులైన పేద విద్యార్ధులకు 25 శాతం సీట్ల కేటాయింపుపై ఫిబ్రవరి 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఈమేరకు జీవో 24ను విడుదల చేశారు. ఐబీ (అంతర్జాతీయ), ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, స్టేట్ సిలబస్ స్కూళ్లన్నిటిలోను విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లను అర్హులైన పేదలకు కేటాయించాల్సి ఉంటుంది. ఆర్టీఈ చట్టం కింద ప్రవేశాలకు సంబంధించి సమస్యలు తలెత్తితే 14417 టోల్‌ఫ్రీ నంబరును సంప్రదించాలి. ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలను, విధివిధానాలను జీవోలో వివరించారు. ఈ స్కూళ్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఒక్కో విద్యార్థికి పట్టణప్రాంతాల్లో రూ.8 వేలు, రూరల్‌లో రూ.6,500, గిరిజన ప్రాంతాల్లో రూ.5,100 చొప్పున చెల్లిస్తారని జీవోలో తెలిపారు.
విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లను ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి, దివ్యాంగులకు రిజర్వేషన్ల వారీగా ఉచితంగా కేటాయించాలి. విద్యాసంస్థల ఫీజులను ప్రభుత్వం చెల్లించాలి. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యాహక్కు చట్టాన్ని ఇలాగే అమలు చేస్తున్నారు. కానీ, రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన, బలహీనవర్గాలకు వందశాతం అమ్మఒడి పథకం కింద సాయం అందిస్తున్నందున ఇందులోంచే ఫీజులు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలోని తమ పిల్లలను బడులకు (ప్రభుత్వ, లేదా ప్రైవేటు) పంపించే అర్హులైన పేద తల్లులందరికీ అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 75 శాతం, ఆపై హాజరు నిబంధన అమలు చేస్తూ పేద పిల్లలందరికీ అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో సీట్లు పొందే ఈ పిల్లలకు సంబంధించి ఆయా స్కూళ్లకు చెల్లించాల్సిన ఫీజును నిబంధనలను అనుసరించి అమ్మ ఒడిని అందుకున్న అనంతరం విద్యాసంవత్సరం చివరన ఆయా స్కూళ్లకు రీయింబర్స్ చేస్తారని జీవోలో పేర్కొన్నారు. అలా తల్లిదండ్రులు చెల్లించకపోతే ప్రభుత్వం ఆమొత్తాన్ని తదుపరి అమ్మ ఒడి నుంచి మినహాయించి స్కూళ్లకు చెల్లిస్తుందని తెలిపారు.
ప్రస్తుతం అమ్మఒడి కింద రూ.15 వేలలో పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణకు రూ.2 వేలు మినహాయించి, రూ.13 వేలు ఇస్తున్నారు. ఈ సాయం అందిన తర్వాత 60 రోజుల్లోపు తల్లిదండ్రులు ఫీజు చెల్లించకపోతే తదుపరి సంవత్సరం ఆ మొత్తాన్ని మినహాయించి, పాఠశాలలకు చెల్లిస్తారు. ప్రస్తుతం 75% హాజరు నిబంధన కోసం ఏడాది పూర్తయిన తర్వాత అమ్మఒడి సాయం అందిస్తున్నారు. గతేడాది ప్రవేశాలు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఏడాది ఇచ్చే అమ్మఒడి నుంచే ఫీజులు చెల్లించాలి. అమ్మఒడితో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందని భావించి, గతేడాది విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలు పొందారు. ఇప్పుడు తాజా ఉత్తర్వులతో తల్లిదండ్రులపైనే ఆ భారం పడింది.
షెడ్యూలు ఇలా..
➥ ఈ సీట్లకు సంబంధించి మార్చి 4న ప్రవేశాల క్యాలెండర్‌తో సహా నోటిఫికేషన్ విడుదల కానుంది.
➥ ఆయా ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లు మార్చి 6 నుంచి 16 వరకు సంబంధిత వెబ్‌సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
➥ విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి సంబంధిత వెబ్‌సైట్ విండో మార్చి 18నుంచి అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 7 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.
➥ అర్హులైన విద్యార్థుల ఎంపిక ఏప్రిల్ 9 నుంచి 12 వరకు చేపడతారు.
➥ మొదటి విడత కేటాయింపు ఏప్రిల్ 13న ఉంటుంది.
➥ విద్యార్థులు ఏప్రిల్ 15 నుంచి 21 లోపు ఆయా స్కూళ్లలో చేరికలను ఖరారు చేసుకోవాలి.
➥ రెండోవిడత సీట్ల కేటాయింపు ఏప్రిల్ 25న చేపడతారు. ఈ విద్యార్థులు ఏప్రిల్ 26 నుంచి 30వ తేదీలోపు ఆయా స్కూళ్లలో చేరాలి.
ఇలా దరఖాస్తు చేసుకోండి..
➥ ప్రైవేటు పాఠశాలల్లో 25% కోటా ప్రవేశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లోని పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.
➥ ఇంటినుంచి కిలోమీటరు దూరంలోని ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలకు మొదట ప్రాధాన్యం ఇస్తారు. తర్వాత మూడు కిలోమీటర్ల దూరంలోని వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.
➥ అనాథలు, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులకు 5%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 4%, ఏడాదికి గ్రామాల్లో రూ.1.20 లక్షలు, పట్టణాల్లో రూ.1.44 లక్షలలోపు ఆదాయం ఉన్న ఆర్థిక బలహీనవర్గాలకు 6% సీట్లను కేటాయిస్తారు. ఆయా రిజర్వేషన్లలో విద్యార్థులు లేకపోతే వాటిని ఇతరులకు కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో మొదట ఎస్టీ పిల్లలకు ప్రాధాన్యం ఇస్తారు.
➥ సీట్లు కేటాయించిన వారం రోజుల్లో పిల్లలు పాఠశాలలో చేరిందీ లేనిదీ యాజమాన్యం నిర్ధారించకపోతే దాన్ని వివాదాస్పద సీటుగా పరిగణిస్తారు. దీన్ని జిల్లా ప్రవేశాల పర్యవేక్షణ కమిటీకి సిఫార్సుచేస్తారు. జిల్లా కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే జిల్లా కలెక్టర్‌ను సంప్రదించొచ్చు. పాఠశాలకు వ్యతిరేకంగా ఏదైనా వివాదాన్ని జిల్లా కమిటీ గుర్తిస్తే సుమోటోగా విచారణ చేపట్టే అధికారం ఉంటుంది.