AP EAPCET 2024 Exams: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించనున్న AP EAPCET -2024 పరీక్షలు మే 16 నుంచి ప్రారంభంకానున్నాయి. ఏపీఎప్‌సెట్-2024 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఏపీ ఎప్‌సెట్ పరీక్షల కోసం ఈసారి మొత్తం 3,61,640 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 16 నుంచి 23 వరకు ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించనుండగా; మే  18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్‌ విభాగానికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మొదటి సెషన్‌లో, మ‌ధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించ‌నున్నారు.


నంద్యాలలో పరీక్ష కేంద్రం మార్పు..
ఏపీఎప్‌సెట్ పరీక్షల నిర్వహణ కోసం నంద్యాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాల్లో మార్పులు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి వెల్లడించారు. మొదట ఆర్‌జీఎంఐటీ, శాంతిరామ్‌ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించగా.. వాటిల్లో ఈవీఎంలను భద్రపరచడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ రెండు కళాశాలల్లో కేంద్రాలున్న వారికి శ్రీరామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల, ఎస్‌వీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పాత కేంద్రాలతో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్న వారు కొత్త హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. అధికారిక వెబ్‌‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంటర్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హాల్‌టికెట్ లేనిదే పరీక్షకు అనుమతించరు. దీనితోపాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది.


ఏపీ ఎప్‌సెట్ 2024 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


పరీక్ష విధానం..
ఏపీఎప్‌సెట్-2024 పరీక్షను మొత్తం 160 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 160 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 80 ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ (మల్టీపుల్ ఛాయిస్) విధానంలో ప్రశ్నులు అడగుతారు. ఒక్కోప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు.


విద్యార్థులకు ముఖ్య సూచనలు..


➥ పరీక్ష సమయానికి గంట ముందు నుంచే అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.  


➥ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను పరీక్ష హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డు లేదా కాలేజీ ఐడీ కార్డును పరీక్ష రోజు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ముఖ గుర్తింపుతోపాటు.. బయోమెట్రిక్ విధానంలో ఫోటో, కుడిచేతి వేలిముద్ర ద్వారా సరిపోల్చి లోపలికి అనుమతిస్తారు. 


➥ అభ్యర్థులు హాల్‌‌టికెట్, ఆన్‌లైన్ దరఖాస్తు పత్రంతోపాటు ఒక ఫోటో, బ్లాక్ లేదా బ్లూ పెన్ మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. 


➥  సెల్‌ఫోన్ సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. 


➥ వాటర్ బాటిల్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పరీక్ష కేంద్రంలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.


➥ అభ్యర్థులు తమ చేతులపై గోరింటాకు, పచ్చబొట్లు ఉంటే అనుమతించరు.  


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..