NEET PG 2024 Exam Date: దేశంలోని మెడికల్ కళాశాలల్లో పీజీకోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన 'నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ - పీజీ (NEET PG) పరీక్ష తేదీ మారింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 7న నీట్ పీజీ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. పరీక్ష తేదీని ముందుకు జరిగి జూన్ 23న నిర్వహించనున్నట్లు నేషనల్ మెడికల్ కమిషన్ మార్చి 20న ఒక ప్రకటనలో తెలిపింది. అయితే అంతకుముందు నీట్ పీజీ పరీక్షను మార్చి 3న నిర్వహించాల్సి ఉండగా.. జులై 7కు వాయిదావేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పరీక్ష తేదీలో మరోసారి మార్పులు చేశారు. 


నీట్ పీజీ ఫలితాలను జులై 15న వెల్లడించే అవకాశం ఉంది. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 5 నుంచి అక్టోబరు 15 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 16 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. ప్రవేశాలు కోరేవారు అక్టోబరు 21లోగా సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. 


నీట్‌ పీజీ పరీక్ష రాసే అభ్యర్థుల అర్హతకు సంబంధించిన కటాఫ్‌ తేదీని ఆగస్టు 15, 2024గా నిర్ణయించింది. దీని ప్రకారం ఆగస్టు 15 లేదా అంతకన్నా ముందు ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేసిన ఎంబీబీఎస్‌ విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షను రాసేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. ఈ పరీక్ష తేదీలో సైతం మార్పు జరిగే అవకాశం ఉంది. కచ్చితమైన తేదీలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు. 



నీట్ పీజీ పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే పీజీ ప్రవేశ పరీక్షను మొత్తం 800 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం మూడు విభాగాల నుంచి 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పరీక్షకు 4 మార్కులు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడున్నర గంటలు. ఇంగ్లిష్‌లో మాత్రమే ప్రశ్నలు ఉంటాయి.


మొత్తం ఆన్‌లైన్ ద్వారానే..
దేశంలోని మెడికల్ కాలేజీల్లో పీజీ ప్రవేశాలకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ కీలక మార్గదర్శకాలు (NMC Guidelines) జారీ చేసింది. వీటి ప్రకారం.. దేశంలోని ఏ వైద్య కళాశాల కూడా సొంతంగా విద్యార్థులను చేర్చుకోవడం కుదరదు. కోర్సుకు సంబంధించిన ఫీజును ముందే తెలపాలి. అప్పుడే ఆ సీటు ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో ఉంటుంది. లేకపోతే ఆ సీటు రద్దవుతుంది. అన్ని మెడికల్ ఇన్‌స్టిట్యూట్లలోని పీజీ ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇందులో సంబంధిత ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయి. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్.. ఇటీవల వెలువరించిన పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య విద్య నియంత్రణలు-2023 లో స్పష్టం చేసింది. రాష్ట్ర లేదా కేంద్ర కౌన్సెలింగ్ అథారిటీ ద్వారానే అన్ని సీట్లకు అన్ని రౌండ్ల కౌన్సెలింగ్ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. సొంతంగా ఏ వైద్య కళాశాల/సంస్థ విద్యార్థులను చేర్చుకోకూడదు. సంబంధిత కోర్సు ఫీజులు ముందుగానే వైద్య కళాశాలలు తెలిపాలి. లేకపోతే ఆ సీటును లెక్కలోకి తీసుకోరు అని ఎన్ ఎంసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
పూర్తిమార్గదర్శకాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...