గుంటూరు జిల్లా పల్నాడులో ఎక్సైజ్ పోలీసుల అత్యుత్సాహం ఓ యువకుడి మరణానికి కారణం అయింది. పోలీసులు అకారణంగా కొట్టారని ఓ యువకుడి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఎక్సైజ్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మృతుని కుటుంబీకునికి ప్రతిపక్ష పార్టీలు, ఇతర సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.
గుంటూరు జిల్లా దాచేపల్లి సమీపంలో భట్రుపాలెంలో రెండురోజుల కిందట తెలంగాణ మద్యం తీసుకు వస్తున్నారంటూ ముగ్గురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి గురజాల సబ్‌జైలుకు తరలించారు. అయితే వారు పోలీసులపై దాడికి ప్రయత్నించారని వారిపై హత్యాయత్నం కూడా పోలీసులు నమోదు చేశారు. అయితే ఏం జరిగిందో కానీ కానీ అలీషా పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారని పోలీసులు గుంటూరు ఆస్పత్రికి తరలించారు. అలీషా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం చనిపోయాడు. దీంతో అలీషా కుటుంబసభ్యుల ఎక్సైజ్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ సిఐ కొండా రెడ్డి తమ బిడ్డను విచక్షణ రహితంగా కొట్టి.. నోట్లో పురుగు మందు పోసి చంపాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురిలో ఒకరైన మిరియాల శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారన్న సమాచారం తెలియడంతో ఆ యువకుడి తాత రాములు గుండెపోటు తో మృతి చెందారు.
అలీషా మృతికి ఎక్సైజ్ పోలీసులే కారణమని రాజకీయ పార్టీలు, ముస్లిం సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అలీషా కుటుంబసభ్యుల్ని నేతలు పరామర్శించారు. గతంలో తెలంగాణ నంచి మద్యం తీసుకు వచ్చి వ్యాపారం చేసిన అలీషా.. ప్రస్తుతం రెస్టారెంట్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారని.. అయినా ఎక్సైజ్ సీఐ తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని ముస్లింలీగ్ అధ్యక్షుడు బషీర్ అహ్మద్ ఆరోపించారు. అలీషా కారులో సీఐ వెంకట్ రెడ్డి మద్యం పెట్టించారని ఆయనంటున్నారు. నిజంగా మద్యం దొరికితే కేసులు పెట్టి జేలుకు పంపాలి గానే కొట్టి చంపే అధికారం ఎవరిచ్చారని బషీర్ అహ్మద్ ప్రశ్నించారు. అలీషా కుటుంబసభ్యులను మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పరామర్శించారు. గురజాల, మాచర్ల ఎమ్మెల్యేలు లారీల కొద్దీ తెలంగాణ మద్యాన్ని తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నారని వారిని ఎవరూ ఆపడం లేదని కానీ.. అమాయకులపై మాత్రం తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని యరపతినేని మండిపడ్డారు. పల్నాడులో ప్రతీ వైసీపీ నేత ఇంట్లో తెలంగాణ మద్యం ఉందన్నారు. పెద్దలను వదిలి పేదలపై ప్రతాపం చూపుతున్నారని ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
అలీషా మృతిపై టీడీపీ నేత నారా లోకేష్ కూడా స్పందించారు. నంద్యాలలో చేయని నేరానికి దొంగ అనే ముద్ర వేసి వేధించి అబ్దుల్ సలామ్ కుటుంబాన్ని బలితీసుకున్న జగన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు మరో మైనార్టీ సోదరుడు అలీషాని అన్యాయంగా చంపేసిందని మండిపడ్డారు. అలీషా హంతకుల్ని ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలీషా మృతి ఘటనపై ఎక్సైజ్ పోలీసులు ఇంత వరకూ స్పందించలేదు. హోంమంత్రి కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. చనిపోయిన వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టారన్న ఆరోపణలు బలంగా వస్తూండటంతో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మాత్రం ఆ కుటుంబానికి న్యాయం కోసం పోరాటానికి ముందుకు వస్తున్నాయి.