Old Man Died Due To Attack By Young Man In Hyderabad: సికింద్రాబాద్‌లోని (Secunderabad) అల్వాల్ పరిధిలో దారుణం జరిగింది. బైక్‌పై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న యువకుడిని ఆపిన వృద్ధుడిపై సదరు యువకుడు దాడి చేశాడు. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వృద్ధుడు గురువారం మృతి చెందాడు. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10 రోజుల క్రితం రాత్రి సమయంలో ఆంజనేయులు రోడ్డు దాటుతుండగా ఓ యువకుడు బైక్‌తో ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. దీంతో యువకున్ని ఆపిన వృద్ధుడు ఇదేంటని ప్రశ్నించగా ఆయనతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన యువకుడు వృద్ధునిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో వృద్ధునికి తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆంజనేయులు గురువారం ప్రాణాలు కోల్పోయాడు.
యువకుడి దాడిలో బలమైన గాయమైందని.. రూ.లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణం దక్కలేదని మృతుడి కుమారుడు కన్నీటిపర్యంతమయ్యాడు. తన తండ్రి మృతికి కారణమైన యువకుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
హోంగార్డు ఆత్మహత్య
మరోవైపు, నగరంలో ఓ హోంగార్డు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. అంబర్‌పేట్ చిలుకానగర్‌లో నివాసం ఉండే రమణ అనే హోంగార్డు ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈయన పంజాగుట్ట ఏసీపీ కార్యాలయంలో హోంగార్డుగా పని చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదంలో ముగ్గురు మృతి
వికారాబాద్ జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ - బీజాపూర్ హైవేపై పూడూరు గేట్ వద్ద ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు యువకులు, ఓ బాలుడు కలిపి పూడూరు నుంచి మేడికొండ వైపు వెళ్తుండగా.. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనతో మృతుల స్వగ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.