Telangana Cabinet Meeting: ఈ నెల 23 తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) భేటీ కానుంది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనుంది. హైడ్రా (Hydra) ఆర్డినెన్సుకు చట్టబద్ధత, రెవెన్యూ చట్టం, మూసీ బాధితులకు న్యాయం చేసే అంశం, వరద నష్టం, రైతు భరోసా అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయా శాఖల నుంచి వివరాలు సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ నెలాఖరున అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రాపై జోరుగా చర్చ సాగుతోంది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు, చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చేస్తూ హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. పేదలు ఇళ్లు కోల్పోతున్నారంటూ ప్రతిపక్ష నేతలు హైడ్రాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా, ప్రభుత్వం ఈ విషయంపై వెనక్కు తగ్గడం లేదు.
హైడ్రాకు మరిన్ని బాధ్యతలు
అటు, రాజకీయ ప్రకంపనల మధ్యే ప్రభుత్వం తాజాగా హైడ్రాకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకూ ఉన్న 27 పురపాలికల్లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణకు అవసరమైన అధికారాలను కట్టబెట్టింది. ఈ ఆదేశాలతో జీహెచ్ఎంసీకి చెందిన రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ బాడీలు, బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ పార్కులు వంటి ఆస్తులను ఆక్రమణకు గురి కాకుండా హైడ్రా రక్షించనుంది. 'జీహెచ్ఎంసీ చట్టం - 1955' కింద అవసరమైన అధికారాలను హైడ్రాకు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.