Group 1 Mains Exams Issue In Telangana: తెలంగాణలో గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షల వివాదం ముదురుతోంది. మెయిన్స్ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళనతో నగరంలో వాతావరణం హీటెక్కింది. అటు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కీలక నేతలతో అభ్యర్థులతో భేటీ కావడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. గాంధీ భవన్‌లో గ్రూప్ - 1 అభ్యర్థులతో (Group 1 Aspirants) పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) గురువారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. వారి డిమాండ్లను సావధానంగా విన్నారు. జీవో 29 రద్దు చేసి పరీక్షలు నిర్వహించాలని.. పాత జీవో 55 ప్రకారం పరీక్షలు జరగాలన్నారు. పాత నోటిఫికేషన్‌లో ఇచ్చిన 503 పోస్టుల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వొద్దన్నారు. పెంచిన 60 పోస్టుల్లో మాత్రమే కొత్తగా అప్లై చేసుకున్న వారికి అవకాశం ఇవ్వాలని తెలిపారు. పాత నోటిఫికేషన్ ప్రకారమే రిజర్వేషన్లు, ఓపెన్ క్యాటగిరీ ప్రకారం పరీక్షలు ఉండాలని.. రిజర్వేషన్ అంశాల్లో కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని పరిష్కరించి పరీక్షలు నిర్వహించాలన్నారు. దీనిపై స్పందించిన మహేశ్ కుమార్ గౌడ్.. ఈ డిమాండ్లపై ప్రభుత్వానికి సమాచారం ఇస్తామని.. సాయంత్రంలోపు క్లారిటీ ఇస్తామని స్పష్టం చేశారు.


కేటీఆర్‌పై ఫైర్


మరోవైపు, బీఆర్ఎస్ హయాంలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేస్తారా.? అంటూ కేటీఆర్‌కు పీసీసీ చీఫ్ సవాల్ విసిరారు. నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే డీఎస్సీ, వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు, గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఏడున్నర లక్షల కోట్ల అప్పులు చేసి మిగులు రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


'అభ్యర్థులకు అండగా ఉంటాం'


అటు, తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోనూ గ్రూప్ - 1 అభ్యర్థులు భేటీ అయ్యారు. జీవో నెంబర్ 29 ఎత్తివేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని.. మెయిన్స్ వాయిదా వేసేలా చూడాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. అభ్యర్థులకు తప్పకుండా సహకరిస్తామని.. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే పార్టీ తరఫున అండగా ఉంటామని స్పష్టం చేశారు. కాగా, గ్రూప్ 1 మెయిన్స్ రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్షపై దాదాపు 33 కేసులు వచ్చాయని.. వాటన్నింటినీ పరిష్కరించిన తర్వాతే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులంతా ఒక్కసారిగా దూసుకురావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు అభ్యర్థులను అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించారు.


మెయిన్స్ నిర్వహణపై సీఎస్ సమీక్ష


అయితే, ఈ వివాదం కొనసాగుతుండగానే ఈ నెల 21 నుంచి షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ నిర్వహణకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 14న టీజీపీఎస్సీ హాల్ టికెట్లను విడుదల చేసింది. ఈ క్రమంలోనే గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.


Also Read: Konda Surekha : వరుస వివాదాలతో సొంత పార్టీకి సమస్యగా మారిన కొండా సురేఖ - రేవంత్ కూడా కాపాడలేరా ?