Warangal Crime : వరంగల్ జిల్లా లేబర్ కాలనీలో ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధ మహిళ కళ్లలో కారం కొట్టి, చేతులు కట్టిపడేసి దోపిడీకి పాల్పడింది ఓ యువతి. ఈ కేసును ఛేదించిన పోలీసులు యువతితో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. సీసీఎస్, మీల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా నిందితులను అరెస్ట్ చేశారు. దోపిడీకి పాల్పడిన యువతి నుంచి లక్ష నలభై ఆరువేల రూపాయల నగదు, ద్విచక్రవాహనం, నిందితురాలు నేరానికి ఉపయోగించిన బురఖా, ఒక సెల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తును కొనుగోలు చేసిన ఇద్దరు నిందితుల నుంచి రెండు లక్షల పదిహేను వేల రూపాయల విలువగల 60 గ్రాముల బంగారు అభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


అసలేం జరిగింది? 


ఈ అరెస్ట్ కు  సంబంధించిన వివరాలను వరంగల్ అదనపు డీసీపీ క్రైమ్స్ పుష్పారెడ్డి మీడియాకు తెలిపారు. వరంగల్ జిల్లా లేబర్ కాలనీలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న నాగిరెడ్డి మేఘన (18), స్థానిక డిగ్రీ కళాశాలో బి.బి.యం రెండో సంవత్సరం చదువుతూ, హనుమకొండలో బ్యూటీ పార్లర్ లో పార్ట్ టైం ఉద్యోగిగా పనిచేస్తోంది. మేఘన తండ్రి మద్యానికి బానిస కావడంతో ఇంటి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, కుటుంబ, వ్యక్తిగత అవసరాలకు డబ్బు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనుకుంది. నిందితురాలు మేఘన బాధిత వృద్ధురాలికి చెందిన మూడు అంతస్తుల భవనంలో కొద్దికాలం కిరాయికి ఉంది. ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారాన్ని చోరీ చేసుకోనేందుకుగా మేఘన ప్రణాళిక వేసుకుంది. ఇందుకోసం తనను గుర్తుపట్టకుండా బురఖా ధరించి వృద్ధురాలి ఇంటికి వెళ్లింది. 



దోపిడీ బంగారం కొన్న ఇద్దరు అరెస్ట్ 


ఈనెల 6వతేదిన మేఘన తనను గుర్తుపట్టకుండా బురఖా ధరించి బాధిత వృద్ధురాలి ఇంటికి వెళ్లి తన స్నేహితురాలికి ఇల్లు కిరాయికి కావల్సింది చెప్పింది. బాధిత వృద్ధురాలి తన ఇంటి కిరాయి కోసం తన కుమార్తెతో ఫోన్లో మాట్లాడిన అనంతరం ఇల్లు చూపించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో బురఖా ధరించిన నిందితురాలు కారంపొడిని ఒక్కసారిగా బాధిత వృద్ధురాలి కళ్లలో చల్లడంతో వృద్ధురాలు కిందపడిపోయింది. వృద్ధురాలి చేతులు కట్టేసి మెడలోని బంగారు గోలుసు దోపిడీ చేసి అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై తప్పించుకుంది. చోరీ చేసిన బంగారు అభరణాన్ని మిగతా ఎల్లంబజార్ కు చెందిన ప్రేమ్ కుమార్ , హనుమకొండ కుమార్ పల్లికి బెజ్జంకి సురేందర్ కు అమ్మింది. కొద్ది మొత్తం డబ్బు తీసుకోని మిగతా డబ్బు కోసం మళ్లీ వస్తానని చెప్పింది మేఘన. వృద్ధురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మీల్స్ కాలనీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  టెక్నాలజీ సాయంతో నిందితురాలిని గుర్తించిన పోలీసులు మంగళవారం ఉదయం నిందితురాలిని తన ఇంటిలో అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు పాల్పడిన నేరాన్ని అంగీకరించడంతో ఆమె నుంచి డబ్బు, ద్విచక్రవాహనం, సెల్ఫోన్, బురఖాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేఘన ఇచ్చిన సమాచారంతో చోరీ సొత్తును కోనుగోలు చేసిన మిగతా ఇద్దరు నిందితుల నుంచి 60 గ్రాముల బంగారు ఆభరాణాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.