KCR to inaugurate BRS office in Delhi on 14 December: బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ఢిల్లీలో బుధవారం ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. కీలక పనులకు కచ్చితంగా ముహూర్తం కోసం చూసే తెలంగాణ సీఎం కేసీఆర్.. ఢిల్లీలో తమ పార్టీ ఆఫీసును బుధవారం మధ్యాహ్నం 12:37 గంటల నుంచి 12:47 గంటల మధ్య ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరించారు. 


తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు ఢిల్లీకి వస్తారని తెలిపారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు కూడా వస్తారని తెలిపారు. కేవలం ఎనిమిదేళ్లలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో రైతులు, పేదల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు కావాలని కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. తాను కేసీఆర్ కు సైనికుడిగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ధనవంతుడు ధనవంతుడుగా ఎదుగుతూనే ఉన్నాడని అన్నారు. భారతదేశం కొంతమంది గుప్పిట్లోకి పోతోందని ఆరోపించారు.  దేశంలో ప్రాజెక్టులు కట్టి ప్రజలకు సాగు, తాగు నీరును ఎందుకు ఇవ్వలేకపోతున్నారో, ఇలాంటి సమస్యలకు కేసీఆర్ పరిష్కారం చూపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలను ఎందుకు దిగుమతి చేసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భావ సారూప్యత ఉన్న నేతలను ఆహ్వానించాం. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ వస్తారని భావిస్తున్నాం. బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం బాగుంటే ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది.


తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల కీలక నేతలకు ఆహ్వానం
‘కేసీఆర్ సైనికుడిగా నాకు చాలా ఆనందంగా ఉంది. కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం తెలంగాణ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు పంజాబ్, హరియానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలు కార్యక్రమానికి వస్తున్నారు. మేం ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. కేవలం 8 ఏళ్ల పాలనతో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను నిలబెట్టిన ఘనత కేసీఆర్ సొంతం. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. 


దేశంలో ఎన్నో వనరులున్నాయి. కానీ ఇప్పటికీ రైతుల సమస్యలు అలాగే ఉన్నాయి. ప్రాజెక్టులు ఎందుకు కట్టలేకపోతున్నాం. వనరులను సద్వినియోగం చేసుకుని ప్రాజెక్టులు కట్టి మనకు కావాల్సిన పంటను దేశంలోనే పండించుకుందాం. విదేశాల నుంచి దిగుమతి అవసరం లేకుండా మన దగ్గరే పంటలు పండించుకుందామని కేసీఆర్ భావిస్తున్నారు. యువతకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం. ఓ విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చేందుకు తెలంగాణ నుంచి జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వచ్చి మార్పులు తీసుకురావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణలో రైతుల కోసం 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లుగా, దేశ వ్యాప్తంగా ఇదే అమలు చేయాలనుకుంటున్నాం. మిషన్ భగీరథ లాంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రతి రాష్ట్రంలోనూ పేదలకు సైతం ఇంటింటికీ తాగునీరు అందిస్తాం. ఆర్థిక విధానాలు రూపొందించి దేశ వ్యాప్తంగా సమూలు మార్పులు తీసుకురావాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. విప్లవాత్మక మార్పు రావాలని, అది కేసీఆర్‌తోనే సాధ్యమని ఎందరో మేధావులు, నేతలు భావిస్తున్నారని’ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.