Hyderabad News: సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం మాఢనమ్మకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదారాబాద్ లోని ఓ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. అది కూడా ఓ పాఠశాలలో కావడం గమనార్హం. రాజేంద్ర నగర్ పరిధిలోని ఓ బడిలో క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్లు బయట పడ్డాయి. బడిలోని సైన్స్ లాబ్ తో పాటు స్టోర్ రూంలో క్షుద్ర పూజలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు క్షుద్ర పూజలు జరిగిన సమయంలోని సీసీటీవీ ఫుటేజీ మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాఠశాల సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 




రెండు నెలల క్రితం క్షుద్ర పూజల ఆరోపణలతో తండ్రీకొడుకుల హత్య


ఉప్పల్ గాంధీ బొమ్మ సమీపంలోని హనుమసాయి నగర్ కు చెందిన నర్సింహుల నర్సింహ శర్మ, ఆయన కుమారుడు నర్సింహుల శ్రీనివాస్ లు గత శుక్రవారం తెల్లవారుజామున హత్యకు గురయ్యారు. నర్సింహ శర్మ క్షుద్ర పూజలు, వాస్తు పూజలు చేసే వారని, ఈ వ్యవహారంలోనే నిందితులు ఆయనపై కక్షగట్టారని పోలీసుల ప్రాథమిక విచారణలో నర్సింహ శర్మ పని మనిషి, స్థానికులు చెప్పినట్లు సమాచారం. సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా.. హత్య చేసిన అనంతరం నిందితులు వైజాగ్ కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందంతో అక్కడికి వెళ్లిన పోలీసులు.. మామిడిపల్లికి చెందిన వినాయక్ రెడ్డి, అతని మిత్రుడు సంతోష్ నగర్ కు చెందిన బాలకృష్ణ రెడ్డిలను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. 


తీవ్రంగా నష్టపోవడంతోనే హత్య!


నర్సింహుల నర్సింహ శర్మ క్షుద్ర పూజలు చేస్తుండే వారు. అలా ఆ పూజల నేపథ్యంలో నర్సింహ శర్మకు, వినాయక్ రెడ్డికి పరిచం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. నర్సింహ శర్మ చెప్పిన అన్ని పూజలు చేసిన వినాయక్ రెడ్డి.. ఆర్థికంగా, ఆరోగ్యంగా నష్టపోయానని, దానికి నర్సింహ శర్మనే కారణం అని అతడిని చంపాలని భావించినట్లు సమాచారం. తన స్నేహితుడు బాలకృష్ణా రెడ్డితో కలిసి హత్యకు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.  నర్సింహ శర్మ ఏ టైముకు ఎక్కడికి వెళ్తున్నాడు.. అతని దినచర్య ఏమిటి అని తెలుసుకునేందుకు నర్సింహ శర్మ ఇంటి ఎదురుగ ఉన్న హాస్టల్ లో దిగారు. వారం రోజుల పాటు నర్సింహ శర్మ కదలికలను పసిగట్టారు. పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. శుక్రవారం ఉదయం బ్యాగులో కత్తులు తీసుకువచ్చారు. నర్సింహ శర్మ ఇంట్లోకి చొరబడి, ఆయన గొంతు కోసి చంపారు. తండ్రిని చంపి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. వారిని అడ్డగించేందుకు నర్సింహ శర్మ కుమారుడు శ్రీనివాస్ ప్రయత్నించగా.. అతడిపైనా వారు దాడి చేశారు. కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు. శ్రీనివాస్ మృతదేహంపై 27 చోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడి అయింది.