Kanipakam News :   కొద్ది రోజులుగా కాణిపాకం ఆలయం వరుస వివాదాల్లో చిక్కుకుని ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది.. తాజాగా స్వకార్యం కోసం ఏకంగా భగవంతుడికి నిర్వహించాల్సిన కార్యాన్నే నిలిపి చేసిన ఘటన కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంకి అనుబంధ ఆలయంగా పిలిచే ఆంజనేయస్వామి స్వామి ఆలయంలో చోటు చేసుకుంది.  శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద అర్చకులు కానుకల తట్ట ఉంచరాదని ఆలయ ఈవో జారీ చేసిన ఆదేశాలపై ఆగ్రహించిన అర్చకుడు ఏకంగా స్వామి వారిని నిర్వహించాల్సిన అభిషేకంనే నిలిపి వేశారు. 


స్వయంభుగా బావిలో వెలసిన శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దర్శనార్ధం ప్రతి నిత్యం వివిధ రాష్ట్రాల నుండి భక్తులు కాణిపాకం‌ ఆలయంకు చేరుకుని స్వామి వారి దర్శనంతో పునీతులు అవుతుంటారు.. అంతే కాకుండా ఇక్కడి వరసిద్దుడు సత్య ప్రమాణాలకు సాక్షాత్తుగా విరాజిల్లుతున్నాడు.. అందుకే ప్రతి నిత్యం దాదాపుగా ముప్పై  నుండి నలభై వేల‌ మంది వరకూ భక్తులు స్వామి వారి సన్నిధికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు.. ఇంతటి విశిష్టత కలిగిన ఆలయంలో కొందరు అర్చకుల వ్యవహార శైలి అధికారులకు తలనొప్పిగా మారింది. రోజుకో  వివాదంను తెచ్చి పెట్టి మరి ఆలయ విశిష్టతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 


కొద్ది రోజుల కిందట విరాళంగా ఇచ్చిన బంగారు విభూతి పట్టీని అర్చకుడు మాయం చేసిన ఘటన మరువక‌ ముందే నేడు మరో‌ అర్చకులు ఏకంగా అనుబంధ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి నిర్వహించాల్సిన అభిషేకంను నిలిపి వేశారు. సోమవారం ఉదయం కాణిపాకం ఆలయ ఈవో వెంకటేశు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో‌ కానుకల తట్ట ఉంచరాని ఆదేశించాడు.. అయితే ఈవో ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయని అర్చకుడు యాధావిధిగా కానుకల తట్ట ఉంచాడు.. దీనిని గమనించిన ఆలయ అధికారి కానుకల తట్ట ఉంచరాదని మరోసారి అర్చకుడిని ఆదేశించారు.  కానుకల తట్ట ఉంచరాదని చెప్పినందుకు   ఆగ్రహించిన ఆంజనేయ స్వామి ఆలయ అర్చకుడి మంగళవారం ఉదయం ఐదు గంటలకు నిర్వహించాల్సిన అభిషేకంను నిర్వహించకుండా మొండి వైఖరిని ప్రదర్శించారు.  


అదే సమయంలో అక్కడ ఉన్న ఆలయ సిబ్బంది, భక్తులు ఇందేంటని ప్రశ్నించినా ఏమాత్రం సమాధానం ఇవ్వకుండా మౌనం వహించాడు.. అయితే అర్చకుడి నిర్వాకంను ఆలయ ఈవో వేంకటేశు దృష్టికి తీసుకెళ్ళారు అధికారులు.. దీనిపై వివరణ ఇవ్వాలని ఈవో అర్చకుడిని అడిగినా ఏమాత్రం సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించారని సమాచారం.. అయితే ఏళ్ళ తరబడి ఆంజనేయ స్వామి ఆలయంలో తాము కానుకల తట్ట ఉంచుతున్నామని, వరసిద్ది వినాయక స్వామి వారి దర్శనంతరం ఆంజనేయ స్వామి ఆశీస్సుల కోసం విచ్చేసే భక్తులు వారి ఇష్టానుసారంగానే కానుకల తట్టలో నగదు వేయడంపై నిషేధం ఏంటని భావించిన అర్చకుడు.. తాను చేసిన పనిని సమర్ధించుకున్నట్లు తెలుస్తొంది.. దీనిపై సిరియస్ అయినా ఆలయ ఈవో, ఛైర్మన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి, దేవదాయ శాఖా అధికారులకు ఫిర్యాదు చేసిన అర్చకుడిపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.. ఏదీ‌ ఏమైనప్పటికీ కాణిపాకం ఆలయంలో అర్చకుల వ్యవహార శైలి రోజు రోజుకి వివాదాస్పదంగా మారుతుందడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.