Vizianagaram Crime : విజయనగరం జిల్లాలో భర్త మర్డర్ కు ప్లాన్ చేసిందో మహిళ. ప్రియుడితో వివాహేతర సంబంధం భర్తకు తెలిసిపోయిందని హత్యకు పక్కా పథకం వేసింది. మరో ఇద్దరి సాయంతో భర్తను చితక్కొట్టి రైలు పట్టాలపై పడేసింది. రైలు పట్టాలపై మృతిదేహం లభించడంతో రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం విజయనగరం రూరల్‌ పోలీసులకు కేసు ట్రాన్స్ ఫర్ చేశారు. ఈ కేసులో విచారణ మొదలుపెట్టిన రూరల్‌ పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. కట్టుకున్న భార్యే ఈ కేసులో నిందితురాలు అని గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో  రూరల్‌ సీఐ టీఎస్‌.మంగవేణి ఆదివారం  వెల్లడించిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.   


అద్దె ఇంటి యజమాని కొడుకుతో సంబంధం 


విజయనగరం మిమ్స్‌ మెడికల్ కాలేజిలో క్లర్క్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్‌ నెల్లిమర్ల డైట్‌ కాలేజి సమీపంలో నివాసం ఉంటున్నారు. గతంలో ఆయన నెల్లిమర్లలోని గొల్లవీధిలో కిలాని సూరి ఇంట్లో రెంట్ కు  ఉండేవారు. అప్పుడు సూరి రెండో కుమారుడు రాంబాబుతో చంద్రశేఖర్‌ భార్యకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం చంద్రశేఖర్‌కు తెలిసి భార్యను హెచ్చరించాడు. దీంతో భర్తను పూర్తిగా అడ్డుతొలగించుకోవాలని ప్రియుడు రాంబాబుతో కలిసి ఫ్లాన్ చేసింది. ప్రియుడి స్నేహితుడు ఎర్రంశెట్టి సతీష్‌కు రూ.40 వేలు సుపారీ ఇచ్చారు. భర్తను హతమార్చేందుకు తన తల్లి సత్యవతిని డబ్బులు అడిగింది మృతుడి భార్య జ్యోతి. ఆమె రూ.20వేలు ఇచ్చింది.    


మద్యం తాగించి ఆపై హత్య 


పథకం ప్రకారం ఏప్రిల్ 24వ తేదీ రాత్రి డైట్‌ కాలేజి దగ్గర జ్యోతి ప్రియుడు రాంబాబు, సతీష్‌లు చంద్రశేఖర్‌కు ఫూటుగా మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న చంద్రశేఖర్ పై ఇనుప రాడ్లతో తలపై బలంగా కొట్టి కత్తితో పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి పరారయ్యారు. రైలు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో మృతుడి భార్య అరుణ జ్యోతి, ఆమె తల్లి సత్యవతి, ప్రియుడు రాంబాబు, ఎర్రంశెట్టి సతీష్‌లను అదుపులోకి తీసుకున్నారు.