Rahul Gandhi OU Meet : హైదరాబాద్ ఓయూలో రాహుల్ గాంధీ సభకు అనుమతి నిరాకరించడంతో విద్యార్థి సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. రాహుల్ గాంధీ సభకు అనుమతి కోరుతూ ఓయూ జేఏసీ తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఓయూ వీసీ, ఓయూ రిజిస్ట్రార్ ను ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. విద్యార్థులతో రాహుల్ గాంధీ ముఖాముఖి చర్చ నిర్వహిస్తారని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు ఉండవని తెలిపారు. లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశమే లేదన్నారు. అయితే అధికార పార్టీ టీఆర్ఎస్ ఒత్తిడి వల్లే సభకు అనుమతి ఇవ్వడం లేదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో సభకు అనుమతి ఇచ్చేందుకు వీసీని ఆదేశించాలని కోర్టును కోరారు.
బల్మూరి వెంకట్ కు రిమాండ్
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌కు స్థానిక కోర్టు ఆదివారం 14 రోజుల రిమాండ్ విధించారు. ఓయూ వీసీ ఛాంబర్ వద్ద ధర్నా చేసిన ఘటనలో 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా కానిస్టేబుల్ పట్ల విద్యార్థి సంఘం నేతలు అసభ్యంగా ప్రవర్తించారని కేసు పెట్టారు. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో పలు సెక్షన్లపై 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని స్థానిక కోర్టులో హాజరుపర్చగా కోర్టుకు వారికి 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో వారిని చంచల్ గుడా జైలుకు తరలించారు. రాహుల్ గాంధీ సభకు అనుమతి నిరాకరించడంతో ఓయూలో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ఆందోళన చేశారు.
చంచల్ గుడా జైలుకు టీపీసీసీ బృందం
ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి నిరారకించడంతో ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఆందోళన చేశారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. బల్మూరి వెంకట్ సహా 17 మందిని చంచల్ గుడా జైలుకి రిమాండ్ తరలించారు. అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించిన ఎన్‌ఎస్‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బలమూరి వెంకట్, మరో 17 మందిని జైలులో టీపీసీసీ బృందం ములాఖత్ అయ్యారు. ములాఖత్ అయిన వారిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్స్ గీతారెడ్డి, తూర్పు జగ్గారెడ్డి , అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఫిరోజ్ ఖాన్, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.
రాహుల్ గాంధీ టూర్
తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన ఖారరు అయింది. ఈ నెల 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాహుల్‌గాంధీ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. శంషాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వరంగల్ సభకు వెళ్లనున్నారు. వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు రాహుల్ గాంధీ ప్రసంగం ఉండనుంది.