KTR News: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలపైన తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి తన విమర్శలు చేశారు. సోమవారం ఉదయం ఆయన ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా వరుస ట్వీట్లు చేశారు. ఇన్ఫోగ్రాఫిక్స్ సాయంతో ప్రత్యేకంగా రూపొందించిన నివేదికలను తయారు చేయించి వాటిని ట్వీట్ చేశారు. దేశం వివిధ రంగాల్లో ఎలా వెనక పడిపోయిందనే విషయంపై కేటీఆర్ ట్వీట్లు చేశారు.


బీజేపీ పాలనలో ఆక్సిజన్​ నుంచి బొగ్గు వరకు చాలా కొరత ఏర్పడిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా బొగ్గు కొరత వల్ల చాలా రాష్ట్రాల్లో కరెంటు సమస్య ఏర్పడిందని విమర్శించారు. అంతేకాక, దేశంలో నిరుద్యోగులు పెరిగిపోయాయని, గ్రామాల విషయంలో ఉపాధి దొరకడం లేదని విమర్శించారు. చివరికి రాష్ట్రాలకు ఇచ్చే నిధుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కోత పెడుతోందని ఆరోపించారు. పీఎం మోదీకి ఉన్న దూరదృష్టి లోపమే ఈ సమస్యలు అన్నిటికి కారణమని విమర్శిస్తూ కేటీఆర్ ట్వీట్​ చేశారు.


‘‘బీజేపీ పాలనలో బొగ్గు కొరత, కరోనా టైంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు కరెంట్ కొరత, యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత, అన్ని సమస్యలకు మూలం PM మోడీకి విజన్ కొరత’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 






పునరుత్పాదక శక్తి వినియోగంలో రాష్ట్రాల నివేదిక గురించి EMBER అనే క్లైమేట్ అండ్ ఎనర్జీ సంస్థ చేసిన ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఇంకా మూడు త్రైమాసికాలు మిగిలి ఉండగా, కేవలం 3 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం మాత్రమే పునరుత్పాదక శక్తి లక్ష్యాలను చేరుకున్నాయని EMBER సంస్థ నివేదించింది. దీన్ని మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఈ నివేదికలో మార్చి నాటికి చేరుకున్న లక్ష్యాల్లో తెలంగాణ 248 శాతం లక్ష్యాలను చేరుకొని అగ్ర స్థానంలో ఉంది.