vizag crime news: విశాఖ ఆర్కే బీచ్ లో కలకలం రేగింది. అర్థనగ్నంగా బయటపడిన మృతదేహాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కూడా చర్చనీయాంశమైంది. ఆ మృతదేహంపై బట్టలు లేకపోవడంతో తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


స్థానికుల ద్వారా మృతదేహం విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు పెద గంట్యాడకు చెందిన శ్వేతగా పోలీసులు గుర్తించారు. శ్వేత మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిందని.. రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తుండగానే అర్థరాత్రి ఓ యువతి మృతదేహం కనిపించినట్లు స్థానికులు ఫోన్ చేశారు.  


మృతురాలు ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి


ఈ క్రమంలోనే అక్కడకు వెళ్లిన పోలీసులు అది శ్వేత మృతదేహంగా గుర్తించారు. అయితే ఆమె పడి ఉన్న తీరు చూస్తే.. అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఒంటిపై దుస్తులు లేకపోవడం, ఇసుకలో సగం మృతదేహం కప్పేసినట్లుగా ఉంది. అయితే ఇది ఎవరో కావాలని చంపేసి, తమ ఆనవాళ్లు దొరక్కుండా ఇసుకలో పాతి పెట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మృతురాలికి పెళ్లి జరిగి రెండేళ్లు అవుతోంది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భవతి అని తెలుస్తోంది. శ్వేత అదృశ్యం కాకముందు భర్తతో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. ఈకేసును చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. 


శ్వేత భర్త హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. శ్వేత మాత్రం అత్తమామ వద్ద విశాఖలో ఉంటున్నారు. శ్వేత, అత్తమామాల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు.  నిన్న కూడా గొడవపడే వెళ్లిపోయిందని ‌అంటున్నారు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో న్యూ పోర్టులో మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్న టైంలోనే తెల్లవారుజాయిన విశాఖ వైఎంసీఏ బీచ్ లో మృత దేహం లభ్యమైంది.