Indian Nationals Rescued From Cambodia: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుకు (Human Trafficking Case) సంబంధించి విశాఖ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కంబోడియా (Cambodia) సైబర్ నేరాగళ్ల నుంచి 60 మందికి విముక్తి కల్పించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ వలలో జిల్లాకు చెందిన 150 మంది చిక్కుకున్నారు. కంబోడియా నుంచి బయల్దేరిన 60 మంది శుక్రవారం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారని సీపీ రవిశంకర్ తెలిపారు. వీరి రాక కోసం బాధిత కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. కంబోడియాలో సైబర్ నేరగాళ్ల చేతిలో 5 వేల మంది భారతీయులు చిక్కుకున్నారని చెప్పారు. కాగా, విదేశాల్లో ఉద్యోగాల ఆశ చూపి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల ముఠాను ఇటీవల విశాఖ (Visakha) పోలీసులు అరెస్ట్ చేశారు. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఏపీ (AP), పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ దేశాలకు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. నిందితులు టాస్క్ గేమ్స్, ఫెడెక్స్ పేరిట సైబర్ నేరాలు చేయడంలో అమాయకులను వాడుకుంటున్నట్లు వెల్లడించారు. డేటా ఎంట్రీ పేరుతో ఉద్యోగాలని చెప్పి ఆన్ లైన్ స్కాంలు చేయడంలో వీరికి ట్రైనింగ్ ఇస్తారని.. మాట వినకుంటే చిత్రహింసలు పెడతారని అన్నారు. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం కలిగించగా.. పోలీసులు బాధితులను రక్షించి స్వగ్రామాలకు చేరేందుకు చర్యలు చేపట్టారు.
మరోవైపు, ఈ కేసును విచారించేందుకు విశాఖ సీపీ ఆధ్వర్యంలో 20 మందితో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటైంది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్ల దర్యాప్తు బృందం హ్యుమన్ ట్రాఫికింగ్ కేసుపై లోతుగా విచారణ చేపట్టింది.
అసలేం జరిగిందంటే.?
విశాఖ గాజువాక ప్రాంతానికి చెందిన రాజేష్ అనే ఏజెంట్ 2013 నుంచి 2019 వరకూ గల్ఫ్ దేశాల్లో ఫైర్ సేఫ్టీ అండ్ ప్రికాషన్ మేనేజర్ గా పని చేశాడు. విశాఖలోనే ఉంటూ గల్ఫ్ దేశాలకు ఫైర్ సేఫ్టీ ఉద్యోగాలకు మానవ వనరులను సరఫరా చేసేవాడు. గతేడాది మార్చిలో కాంబోడియా నుంచి సంతోష్ అనే వ్యక్తి ఫోన్ చేసి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్స్ గా పని చేసేందుకు కొంతమందిని పంపాలని.. కమీషన్ ఇస్తానని ఆశ చూపాడు. ఇందుకు అంగీకరించిన రాజేష్ సోషల్ మీడియా ద్వారా డేటా ఎంట్రీ ఉద్యోగాలకు ప్రకటన ఇవ్వగా.. నిజమని నమ్మిన కొందరు నిరుద్యోగులు రూ.1.50 లక్షల వంతున అతనికి కట్టారు. రాజేష్ వారిని కంబోడియా ఏజెంట్‌కు అప్పగించాడు. ఇలా పలు దఫాలుగా వివిధ ఏజెంట్ల 150 మంది నిరుద్యోగులను కంబోడియాకు పంపించాడు.
ఆన్ లైన్ మోసాలపై శిక్షణ
ఉద్యోగాలని నమ్మి అక్కడకు వెళ్లిన వారికి ఆన్ లైన్ స్కామ్స్, సైబర్ నేరాలు ఎలా చేయాలో ఈ ముఠా శిక్షణ ఇచ్చేది. ఫెడెక్స్, టాస్క్ గేమ్స్, ఆన్ లైన్ మోసాలు చేయాలని నిరుద్యోగులను బలంవంతం చేసింది. మాట వినకుంటే వారిపై చిత్ర హింసలకు పాల్పడేది. వారిని రూంలో బంధించి భోజనం కూడా పెట్టకుండా వేధించేది. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకున్న విశాఖ వాసి ఇక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు నిందితుల ముఠాను అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో బాధితులను గుర్తించారు. ఈ మేరకు విశాఖ సీపీ రవిశంకర్ వివరాలు వెల్లడించారు.
ఇప్పటికే కేసు గురించి కంబోడియా ఎంబసీ సిబ్బందికి తెలిపినట్లు సీపీ చెప్పారు. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, తుని, పలాస, కలకత్తా నుంచి నిరుద్యోగ యువత వీరి ఉచ్చులో చిక్కుకున్నారని అన్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తునకు కంబోడియాలోని భారత ఎంబసీ సహకారం తీసుకుంటామన్న సీపీ.. ఈ ముఠా వెనుక ఎవరున్నారో ఆరా తీస్తున్నట్లు చెప్పారు. విదేశాల్లో ఉద్యోగం అనగానే నిరుద్యోగులు ఆలోచించాలని.. ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.