How to Save & Invest Money From Salary: సేల్స్‌ బాయ్‌ అయినా, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయినా; నెలకు ₹10,000 సంపాదించినా, ₹1 లక్ష డ్రా చేసినా... ఆదా చేయకపోతే ఎంత డబ్బయినా ఆవిరైపోతుంది. డబ్బును సేవ్‌ చేయడం ఒక టాలెంట్‌. ప్రతి నెలా సేవ్‌ చేయాలంటే ఒక యాక్షన్ ప్లాన్ లేదా చెక్‌ లిస్ట్ ఉండాలి, దానిని బ్రేక్‌ చేయకుండా కచ్చితంగా పాటించాలి. మీకు ఆరోగ్యకరమైన ఆర్థిక అలవాట్లు ఉంటే, మీ జీతంలో ఎక్కువ భాగాన్ని సులభంగా ఆదా చేయవచ్చు.

జీతంలో ఎంత పొదుపు చేయాలి?
చాలా మంది జీతాలను & వాళ్ల ఖర్చులు, పదవీ విరమణ తర్వాత ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన కొంతమంది ఆర్థిక నిపుణులు.. పొదుపు, పెట్టుబడులు, ఇంటి ఖర్చులకు సంబంధించి ఒక ఆదర్శవంతమైన సూత్రాన్ని ప్రకటించారు. నెలవారీ ఆదాయంలో కనీసం 20% ఆదా చేయడం తెలివైన వ్యక్తి లక్షణమని సూత్రీకరించారు. భవిష్యత్‌ ప్రయోజనాల కోసం దీనిని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.

ఇప్పుడొక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి జీతం 50,000 రూపాయలు అనుకుందాం. శాలరీ తీసుకోగానే చేయాల్సిన మొదటి పని.. తన జీతంలో 24% లేదా 12,000 రూపాయలను సిప్‌ (SIP), మ్యూచువల్‌ ఫండ్స్‌ (Mutual Funds), షేర్లు (Shares), ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (Fixed Deposits) వంటి పెట్టుబడులకు కేటాయించడం. ఈ పని చేసిన తర్వాతే ఇంటి ఖర్చుల గురించి ఆలోచించాలని ఆర్థిక నిపుణులు చెప్పారు. జీతంలో 30% లేదా 15,000 రూపాయలను ఇంటి అద్దెకు కేటాయించాలి. 10% లేదా 5,000 రూపాయలను కిరాణా సరుకుల కోసం పక్కనబెట్టాలి. 14% లేదా 7,000 రూపాయలను పిల్లల చదువుల కోసం వినియోగించాలి. 4% లేదా 2,000 రూపాయలను ఆరోగ్యం/ ఫిట్‌నెస్‌ కోసం వెచ్చించాలి. మరో 12% లేదా 6,000 రూపాయలను వైద్య పరమైన సేవింగ్స్‌ లేదా ఇతర పొదుపుల కోసం ఉపయోగించాలి. చివరిగా మిగిలిన 6% లేదా 3,000 రూపాయలను సినిమాలు, షికార్లు, దుస్తులు వంటి వాటి కోసం ఖర్చు చేయాలి.

మొత్తం శాలరీ

50 వేలు అనుకుంటే

ఖర్చుల వివరాలు  ఎంత ఖర్చు  చేయాలి  శాలరీలో అది ఎంత శాతం ఉండాలి
పొదుపు(మార్కెట్‌లో, సిప్‌లో, మూచ్యువల్‌ ఫండ్స్‌, బ్యాంకుల్లో ఎక్కడైనా పొదపు చేయవచ్చు)  12 వేలు  24 శాతం 
ఇంటి అద్దె 15 వేలు  30 శాతం 
ఇంటి సరకులు 5 వేలు  10 శాతం 
పిల్లల చదువుల కోసం చేయాల్సిన ఖర్చు  7 వేలు  14 శాతం 
ఆరోగ్యం కోసం చేయాల్సిన ఖర్చు  2 వేలు  4 శాతం 
ఆరోగ్య బీమా, ఆసుపత్రి బిల్లుల ఖర్చు  6వేలు  12 శాతం 
ఇతర ఖర్చులు(టూర్‌లు, రెస్టారెంట్‌లు, సినిమాలు) 3 వేలు  5 శాతం 

ఇంటి ఖర్చులు చెల్లించక ముందు ఆదా చేయాలా, తర్వాత ఆదా చేయాలా?
ఇంటి ఖర్చులు, ఇతర బిల్లులు చెల్లించే ముందే పొదుపు లేదా పెట్టుబడి కోసం కేటాయించడం ముఖ్యం. దీనివల్ల, పొదుపు/ పెట్టుబడికి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చినట్లు అవుతుంది, ఇదొక మంచి అలవాటుగా మారుతుంది. కనీస పొదుపు లేదా పెట్టుబడి లేకుండా మీ జీతాన్ని ఖర్చు చేయడాన్ని అస్సలు ఊహించుకోవద్దు.

పొదుపు/ పెట్టుబడులను ఆటోమేట్ చేయవచ్చా?
మన దేశంలో, దాదాపుగా అన్ని బ్యాంకుల్లోనూ సేవింగ్స్ ఖాతాలకు ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంది. దీంతోపాటు, వివిధ యాప్‌లు, ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఆటోమేటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ సేవలు అందిస్తున్నాయి.

పొదుపును సంపదగా మార్చవచ్చా?
నిస్సందేహంగా. పొదుపును సంపదగా మార్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సాంప్రదాయ పొదుపు ఎంపికలను మించి రాబడిని అందించే చాలా మార్గాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, షేర్‌ మార్కెట్‌ వంటివి మీకు సాయం చేస్తాయి. అయితే, మంచి పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవడం కోసం ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

వినోద ఖర్చులు తగ్గించుకోవాలా?
అవసరం లేదు. భవిష్యత్‌ కోసం పొదుపు/ పెట్టుబడి చేయడం ఎంత కీలకమో, ప్రస్తుత జీవితాన్ని ఆస్వాదించడం కూడా అంతే ముఖ్యం. అయితే, దీనికోసం కొంత విచక్షణ అవసరం. ప్రతినెలా వినోద ఖర్చుల కోసం కొంత బడ్జెట్‌ను సెట్ చేయండి, దానికి కట్టుబడి ఉండండి. 

మరో ఆసక్తికర కథనం: ఈపీఎఫ్‌వోలో చాలా రకాల పెన్షన్లు - ఏ పింఛనుకు ఎవరు అర్హులు?