EPFO Pension Scheme Types: మన దేశంలోని ఉద్యోగులు, కార్మికులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించడంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (Employees' Provident Fund Organisation లేదా EPFO) కీలకంగా పని చేస్తోంది. పని చేస్తున్న ఉద్యోగులు/ కార్మికులు తమ జీతంలో 12% మొత్తాన్ని EPFO ఖాతాలో జమ చేస్తారు. కంపెనీ యజమాన్యం కూడా ప్రతి నెలా అంతే మొత్తాన్ని ఉద్యోగి ఖాతాలో డిపాజిట్‌ చేస్తుంది. ఇలా పోగైన డబ్బు, ఉద్యోగి/ కార్మికుడు పనిని మానేసిన తర్వాత పదవీ విరమణ ప్రయోజనం & పింఛను రూపంలో అందుతుంది. ఉద్యోగులు/ కార్మికుల కోసం EPF, ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS), బీమా పథకాన్ని (EDLI) ఈపీఎఫ్‌వో నిర్వహిస్తుంది.


EPS ప్రయోజనం పొందేందుకు అర్హతలేంటి?
EPS ప్రయోజనం పొందాలంటే తప్పనిసరిగా EPFO సభ్యుడై ఉండాలి. ముందస్తు పెన్షన్ పొందడానికి కనీసం 50 ఏళ్ల వయస్సు, సాధారణ పెన్షన్ కోసం 58 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. కనీసం 10 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసి ఉండాలి.


EPS పెన్షన్ల రకాలు
ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌ (EPS) కింద వివిధ రకాల పింఛను పథకాలు ఉన్నాయి. EPFO సభ్యులు, ఆ కుటుంబంలోని వ్యక్తులు, నామినీలు ఈ పెన్షన్లకు అర్హులు.


వితంతువు కోసం పింఛను (Widow Pension): వితంతువు చనిపోయేవరకు లేదా ఆమె మళ్లీ వివాహం చేసుకునే వరకు విడో పెన్షన్‌ వస్తుంది. ఒకవేళ, ఒక కుటుంబంలో ఎక్కువ మంది వితంతువులు ఉంటే, వయస్సులో అందరి కంటే పెద్ద మహిళకు ఈ పింఛను అందుతుంది.


పిల్లల కోసం పింఛను ‍‌(Child Pension): పిల్లలకు 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వితంతు పింఛనుతో పాటు ఛైల్డ్‌ పెన్షన్‌ తీసుకుంటారు. 25 ఏళ్ల వయస్సు వచ్చే నాటికి ఆ పిల్లలు ఏదోక ఆదాయం సంపాదించే స్థాయికి చేరతారన్న ఉద్దేశంతో ఆ వయోపరిమిని నిర్ణయించారు. ఛైల్డ్‌ పెన్షన్‌ వితంతు పింఛనులో 25%గా ఉంటుంది. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు పిల్లలు ఈ ప్రయోజనం పొందవచ్చు.


ముందస్తు పింఛను (Reduced Pension): సాధారణ పదవీ విరమణ వయస్సు కంటే ముందు నుంచే తీసుకునే పెన్షన్‌ ఇది. దీని కోసం, ఉద్యోగి/ కార్మికుడు కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. 50 ఏళ్ల నుంచి 58 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. అయితే, ఈ రకమైన పింఛన్‌ ప్లాన్‌తో కొంత నష్టం ఉంటుంది. దీనిలో, ఫింఛను మొత్తం ప్రతి సంవత్సరం 4% తగ్గుతుంది. అందుకే దీనిని 'రెడ్యూస్డ్‌ పెన్షన్‌ ప్లాన్‌' అని పిలుస్తారు.


అనాథ పిల్లల కోసం పింఛను ‍‌(Orphan Pension): దురదృష్టవశాత్తు EPFO సభ్యుడు మరిణిస్తే, ఈ కేస్‌లో వితంతు పింఛను పొందే వ్యక్తి కూడా లేకపోతే, ఆ కుటుంబంలోని పిల్లలు ఆర్థిక భద్రత కోల్పోతారు. ఇలా జరక్కుండా, ఆ పిల్లలకు అనాథ పింఛన్‌ను EPFO అందిస్తుంది. వితంతు పెన్షన్‌లో 75% మొత్తం ఆర్ఫాన్‌ పెన్షన్‌ రూపంలో అందుతుంది. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు పిల్లలు ఈ ప్రయోజనం పొందొచ్చు.


మరో ఆసక్తికర కథనం: నయా అప్‌డేట్‌ - ఆధార్‌ లింక్‌ కాకపోయినా EPF డెత్ క్లెయిమ్‌ ఆలస్యం కాదు