EPFO Update: ఉద్యోగుల భవిష్య నిధికి సంబంధించి, ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెద్ద అప్‌డేట్‌ ప్రకటించింది. EPF ఖాతాకు ఆధార్‌ లింక్‌ చేయకుండా మరణించిన సభ్యులకు సంబంధించిన క్లెయిమ్‌లను పూర్తి చేసేందుకు వెసులుబాటు కల్పించింది. కొత్త సవరణను ఈ నెల 17న EPFO ప్రకటించింది. 


సమస్య ఏంటి?
దురదృష్టవశాత్తు EPFO సబ్‌స్క్రైబర్‌ మరణిస్తే, క్లెయిమ్‌ ప్రాసెస్‌ సమయంలో అతని ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయడంలో ఫీల్డ్‌ ఆఫీసర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల క్లెయిమ్‌ ప్రక్రియ ఆగిపోతోంది, మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రయోజనాలను అందించడంలో ఆలస్యమవుతోంది. దీంతో, ఆయా కుటుంబ సభ్యుల నుంచి EPFOకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని, అలాంటి కేసుల్లో ఆధార్ సీడింగ్ అవసరం లేకుండానే క్లెయిమ్‌ ప్రాసెస్ చేయాలని EPFO నిర్ణయించింది. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి త్వరగా ఆర్థిక ప్రయోజనాలను అందించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇక్కడ కొన్ని రూల్స్‌ పాటించాలి,


- ప్రతి కేసుకు ఇ-ఆఫీస్ ఫైల్ ద్వారా అనుమతి అవసరం
- చనిపోయిన వ్యక్తి సభ్యత్వాన్ని & హక్కుదారు చట్టబద్ధతను నిరూపించడానికి తీసుకున్న చర్యలను నమోదు చేయాలి
- మోసపూరిత క్లెయిమ్‌ జరక్కుండా అధికారి చేసే సూచనలను తప్పక పాటించాలి


సమస్య ఎక్కడ వస్తోంది?
చనిపోయిన వ్యక్తికి సంబంధించిన క్లెయిమ్ ప్రక్రియ ఆలస్యమవుతున్న కొన్ని సందర్భాలను EPFO వెల్లడించింది. అవి... 1. సభ్యుడి ఆధార్ సమాచారం లేకపోవడం (ఆధార్ రాకముందున్న కేసుల విషయంలో), 2. ఆధార్‌ నంబర్‌ డీయాక్టివేట్ కావడం 3. ఉడాయ్‌ (UIDAI) డేటాబేస్ ద్వారా ఆధార్‌ను ధృవీకరించడంలో ఇబ్బంది.


సమస్యకు పరిష్కారం
ఈ సమస్యలను పరిష్కరించడానికి EPFO ఒక విధానం ప్రకటించింది. ఒకవేళ, ఆధార్‌ అనుసంధానం కాని కేస్‌లో సభ్యుడు మరణిస్తే, క్లెయిమ్‌ కోసం భౌతికంగా దరఖాస్తు చేసుకున్నప్పుడు తాత్కాలిక అలవెన్స్‌ ఇస్తారు. ఇ-ఆఫీస్ ఫైల్ ద్వారా OIC (Officer in Charge) నుంచి ఆమోదం లభిస్తే క్లెయిమ్‌ ప్రాసెస్‌ పూర్తి చేయవచ్చు. చనిపోయిన వ్యక్తి EPFO సభ్యుడేనని & హక్కుదారుకు చట్టబద్ధత ఉందని కుటుంబ సభ్యులు నిరూపించాలి. EPFO ఇచ్చిన వెసులుబాటును దుర్వినియోగం చేయకుండా సంబంధిత అధికారి నిర్దేశించిన చర్యలను చట్టబద్ధ హక్కుదారు పూర్తి చేయాలి.


ఈ ఏడాది మార్చి 26 నాటి ప్రకటన ప్రకారం, EPF ఖాతాకు ఆధార్ నంబర్‌ లింక్‌ కాని సభ్యుడు మరణిస్తే, నామినీకి చెందిన ఆధార్ నంబర్‌ను సిస్టమ్‌లో అప్‌లోడ్‌ చేస్తారు, JD ఫారంపై సంతకం చేయడానికి నామినీని అనుమతిస్తారు. మిగిలిన ప్రక్రియ మొత్తం యథాతథంగా కొనసాగుతుంది. ఒకవేళ, ఆ ఖాతాలో నామినీ పేరు కూడా లేకపోతే, అతని కుటుంబ సభ్యులు/చట్టపరమైన వారసుల్లో ఒకరికి తమ ఆధార్‌ సమర్పించడానికి, JDని ధృవీకరించడానికి అనుమతి లభిస్తుంది. దీనికి, మిగిలిన కుటుంబ సభ్యులు/చట్టపరమైన వారసుల సమ్మతి అవసరం.


2023-24 ఆర్థిక సంవత్సరంలో, మొత్తం 44.5 మిలియన్ క్లెయిమ్‌లను ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌ పరిష్కరించింది. దీనిలో, 28.4 మిలియన్ అడ్వాన్స్ క్లెయిమ్‌లు కూడా ఉన్నాయి.


మరో ఆసక్తికర కథనం: మీ పెట్టుబడి ఎప్పుడు రెట్టింపవుతుంది? రాబడి గుట్టు విప్పే కీలక రూల్‌ ఇది