What is Rule 72 In Investments: షేర్లయినా, బంగారమైనా, స్థిరాస్తి వ్యాపారమైనా, మరేదైనా వ్యాపారమైనా సరే.. పెట్టుబడి పెట్టే ముందు ప్రతి ఒక్కరు కచ్చితంగా ఆలోచించే విషయం 'రాబడి'. ఫలానా చోట పెట్టుబడి పెడితే ఎంత వడ్డీ వస్తుంది లేదా ఎంత రాబడి వస్తుందని లెక్కలు వేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. కొందరు, తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం కోసం ఎక్కువ రిస్క్‌ ఉన్న మార్గాల్లో పెట్టుబడులు పెడతారు. మరికొందరు, తమ డబ్బుకు రక్షణ కల్పిస్తూనే ఎక్కువ రిటర్న్‌ ఎక్కడ వస్తుందో పరిశోధిస్తారు. అయితే, తమ పెట్టుబడి రెట్టింపు కావడానికి ఎంత సమయం పడుతుందనేది అందరి మదిలోకి వచ్చే అతి పెద్ద ప్రశ్న.


మీ పెట్టుబడి ఎప్పుడు రెట్టింపు అవుతుందని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నా, లేదా, ఎవరైనా మిమ్మల్ని అడిగినా తడుముకోకుండా సమాధానం చెప్పడానికి ఈ రూల్‌ ఉపయోగపడుతుంది. సెకన్ల సమయంలోనే మీ లెక్కను తేల్చి సమాధానం ఇస్తుంది. వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో (Personal Finance) వినిపించే ఈ నియమాన్ని 'రూల్‌ 72' లేదా 'రూల్ ఆఫ్‌ 72 ఆఫ్‌ పర్సనల్ ఫైనాన్స్' అంటారు. మీరు ఇన్వెస్ట్‌ చేసిన డబ్బు రెట్టింపు కావడానికి ఎంత సమయం లేదా ఎన్ని సంవత్సరాలు పడుతుందన్న విషయాన్ని ఈ రూల్‌ సాయంతో చాలా సులభంగా తెలుసుకోవచ్చు.


చక్రవడ్డీ కోసం ఈ రూల్‌
వాస్తవానికి, ప్రజలు వివిధ రకాల పెట్టుబడులపై సాధారణ వడ్డీ (Simple Interest) మాత్రమే పొందుతారు, కొన్ని సందర్భాల్లో మాత్రం చక్రవడ్డీ (Compound Interest) ప్రయోజనాన్ని పొందుతారు. చక్రవడ్డీ కేస్‌లో, ఇన్వెస్ట్‌ చేసిన డబ్బు రెట్టింపు కావడానికి తక్కువ సమయం పడుతుంది, కానీ దాని గణన కొంచెం క్లిష్టంగా ఉంటుంది. పర్సనల్‌ ఫైనాన్స్‌కు చెందిన రూల్‌ 72 ఈ లెక్కను సులభంగా మారుస్తుంది.


అసలు రూల్‌ 72 అంటే ఏంటి అని తెలుసుకునే ముందు, మీ డబ్బుపై ద్రవ్యోల్బణం (Inflation) ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇన్‌ఫ్లేషన్‌ కారణంగా ప్రతి ఒక్కరి కొనుగోలు సామర్థ్యం నేరుగా ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. ద్రవ్యోల్బణం కారణంగా డబ్బు విలువ స్థిరంగా ఉండదు, ప్రతి సంవత్సరం తగ్గుతూ ఉంటుంది. అందుకే, ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చే పెట్టుబడి ఎంపికలను ‍‌(Investment Options) ఎంచుకోమని నిపుణులు ఎప్పుడూ సలహా ఇస్తారు. అప్పుడు మాత్రమే మీ డబ్బు విలువ ద్రవ్యోల్బణాన్ని మించి పెరుగుతుంది.


రూల్‌ 72 ఇలా పని చేస్తుంది..
ఉదాహరణకు, మీరు 10 లక్షల రూపాయలను బ్యాంక్‌లో FD చేశారని భావిద్దాం. బ్యాంక్ మీకు ఏడాదికి 8% చక్రవడ్డీని అందిస్తోంది. రూల్ 72 ప్రకారం, మీరు రాబడి రేటుతో 72ను భాగించాలి. ఇప్పుడు మీరు పొందే సంఖ్య మీ పెట్టుబడి రెట్టింపు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెబుతుంది. ఈ కేస్‌లో.. 72ని 8తో భాగిస్తే 9 వస్తుంది. అంటే 8% వడ్డీ ఇచ్చే FDలో మీ రూ.10 లక్షల పెట్టుబడి రూ.20 లక్షలు కావడానికి 9 సంవత్సరాలు పడుతుంది. ఇలా, మీ పెట్టుబడి ఎంత కాలంలో డబుల్‌ అవుతుందో సులభంగా తెలుసుకోవచ్చు.


మరో ఆసక్తికర కథనం: కక్కుర్తి పడితే మీ డబ్బు దొంగలపాలు - హెచ్చరికలు పంపిన 4 బ్యాంక్‌లు