తాండూరులో జరిగిన ఓ దొంగతనం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గ్రామస్థులు కూడా ఈ విషయం తెలుసుకొని అవాక్కయ్యారు. కానీ, ఆ దొంగతనం అలా జరిగినందుకు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. దొంగతనానికి వచ్చిన దొంగకు కాస్త మానవత్వం ఉందేమో అంటూ చర్చించుకున్నారు. ఎందుకంటే, ఆ దొంగ ఇంట్లోని బీరువాలో ఎదురుగా ఉన్న బంగారు నగలు, వెండి వస్తువులను వదిలేసి బట్టలు ఎత్తుకుపోయాడు. వికారాబాద్ జిల్లాలోని పాత తాండూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.


సాధారణంగా ఏ దొంగ అయినా ఇంట్లోని బంగారం, డబ్బులు లాంటి విలువైన వస్తువుల కోసం చూస్తాడు. ఇంకో విషయం ఆలోచించకుండా వాటితో పరార్ అవుతాడు. అలాంటిది ఓ ఇంట్లో కేవలం కొత్త బట్టలను మాత్రమే మూటగట్టుకొని వెళ్లాడు.. ఓ దొంగ. ఇల్లంతా చిందరవందర చేసి, మొత్తం వెతికి బంగారం, డబ్బులు ఉన్నా వాటిని ముట్టుకోకుండా ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అవి భద్రంగా అక్కడే ఉండడంతో యజమానులు ఊపిరిపీల్చుకున్నారు.


శనివారం నాడు పోలీసులు, బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తాండూరులోని కొడంగల్‌ రోడ్డు మార్గంలోని ఓ కాలనీలో మోనాచారి కుటుంబం నివాసం ఉంటోంది. భార్య, ఇద్దరు కుమారులతో ఆయన అక్కడ ఉంటున్నారు. దగ్గరి బంధువుల్లో ఒకరు ఆస్పత్రిలో చేరారని తెలుసుకొని.. ఇంటికి తాళం వేసి పరిగికి అందరూ వెళ్లారు. పది రోజులుగా అక్కడే ఉన్నారు. ఆ ఇంటికి తాళం వేసి ఉండడం గమనించిన దొంగ శుక్రవారం రాత్రి తాళం పగలగొట్టి లోపలికి చొరబడ్డాడు. 


ఇంట్లోని వస్తువులు అన్నీ చిందరవందర చేశాడు. బీరువాలో 6 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి వస్తువులు, డబ్బులు, కొత్త బట్టలు కూడా ఉన్నాయి. ఇటీవలే వారి కొడుకు పెళ్లి జరగడంతో కొత్త బట్టలే బీరువాలో ఎక్కువగా ఉన్నాయి. ఇల్లంతా వెతికి ఆ దొంగ, బంగారం, వెండిని వదిలేసి కేవలం కొత్త ప్యాట్లు, షర్టులు, కొత్త చీరలను మూటగట్టుకొని వెళ్లిపోయాడు. శనివారం ఉదయం స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఇంటి యజమానురాలు హైమావతి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చిన తరువాత ఇంటిని పరిశీలించారు. బంగారం, వెండి భద్రంగానే ఉండడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.


Also Read: Hyderabad: హాస్టల్‌లో నిద్రలేచిన విద్యార్థులకు భారీ షాక్! వెంటనే ప్రిన్సిపల్‌ వద్దకు పరుగులు


Also Read: KCR Mumbai Tour: నేడే కేసీఆర్ ముంబయి టూర్ - సీఎం ఉద్ధవ్, శరద్ పవార్‌తో వేర్వేరుగా భేటీ, షెడ్యూల్ ఇదీ