టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ముంబయి పర్యటనకు వెళ్తున్నారు. ముంబయిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధిపతి ఉద్ధవ్‌ ఠాక్రేతో సమావేశం కానున్నారు. ఎన్సీపీ అధినేత శరద్‌ను కూడా ఆయన కలిసి చర్చలు జరపనున్నారు. కేసీఆర్‌తో కలిసి నడుస్తామని, ఆయనకు మద్దతిస్తామని ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే సీఎంకు ఫోన్‌లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో పలువురు ప్రాంతీయ పార్టీల నేతలు కూడా స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ముంబయికి వచ్చి తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరారు. అందుకే సీఎం కేసీఆర్‌ నేడు ఉదయం 11 గంటలకు బయల్దేరి ముంబయికి వెళ్తున్నారు. మళ్లీ సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం వేళ ఉద్ధవ్‌తో భేటీ అవుతారు.


సాయంత్రం శరద్ పవార్‌తో
ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం అనంతరం ఆయనతో కలిసి భోజనం చేయనున్నారు. అనంతరం కేసీఆర్ ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటలకు వీరి భేటీ జరుగుతుంది. కేసీఆర్‌ వెంట పలువురు పార్టీ నాయకులు కూడా వెళ్లనున్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టాల హక్కుల్లో పెరుగుతున్న కేంద్రం జోక్యం, కేంద్రంపై పోరాటంలో భావసారూప్యం ఉన్న పక్షాల ఐక్యత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీరితో భేటీ అవుతున్నారు.


గతంలో వీరితో భేటీలు
బీజేపీ, కాంగ్రెస్సేతర కూటమి ఏర్పాటు కోసం తొలుత సీపీఎం అగ్రనేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్‌ కారాఠ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌ కూడా కేసీఆర్‌కు మద్దతు పలికారు. తర్వాత ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వీ యాదవ్‌‌ను కేసీఆర్ ప్రగతి భవన్‌కు పిలిపించుకున్నారు. ఆ సమయంలోనే ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ ఫోన్‌ చేసి కేసీఆర్‌కు మద్దతు పలికారు. గతంలో కేసీఆర్‌ తమిళనాడు పర్యటనకు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తోనూ భేటీ అయ్యారు. ఇటు కర్ణాటక నుంచి జేడీఎస్‌ నేత దేవె గౌడ, సీపీఐ అగ్రనేత డీ రాజా, పలు రైతు సంఘాల నేతలు కేసీఆర్‌కు మద్దతు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం కేసీఆర్‌కు ఫోన్‌చేసి మేము సైతం మద్దతు పలికారు.


హరీశ్ రావు కూడా..
కేసీఆర్‌తో పాటు మంత్రి హరీశ్ రావు కూడా ముంబయి వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇక ముంబయి పర్యటన అనంతరం కేసీఆర్‌ కర్ణాటక వెళ్లనున్నారని సమాచారం. అక్కడ మాజీ ప్రధాని దేవె గౌడతో భేటీ కానున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఢిల్లీలో మమతా బెనర్జీ నిర్వహించనున్న సమావేశానికి కూడా కేసీఆర్‌ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.