తెలుగు సినీ పరిశ్రమకు ఇవాళ బిగ్‌డే. 24 క్రాఫ్ట్‌లకు చెందిన కీలక వ్యక్తులంతా ఇవాళ సమావేశమవుతారు. సినీ పరిశ్రమ సమస్యలపై మాట్లాడబోతున్నారు. 


తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో చిత్ర పరిశ్రమ ప్రతినిధులు భేటీ అవుతారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలతో సినీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంది. ముఖ్యంగా ఏపీలో టికెట్‌లపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది.


దీనీపై చిరంజీవి నేతృత్వంలోని సినిమా ప్రతినిధుల బృందం సీఎం జగన్‌తో సమావేశమై సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. తెలుగు సినీ పరిశ్రమను ఆదుకోవాలని సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 


దీనికి తోడు మోహన్ బాబును సమావేశానికి పిలవకుండా కొందరు అడ్డుపడ్డారని మా అధ్యక్షుడు సంచలన కామెంట్స్ చేశారు. తాము ఈ వివాదాన్ని తమలో తామే పరిష్కరించుకుంటామని అన్నారాయన. ఇవాల్టి సమావేశంలో ఆ అంశాలను ప్రస్తావిస్తారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.


సినీ ప్రముఖులతో సీఎంజగన్ నిర్వహించిన సమావేశానికి మోహన్ బాబును పిలువలేదని ప్రచారం జరుగుతోందని కానీ అది నిజం కాదని విష్ణు స్పష్టం చేశారు. మోహన్‌బాబు ( Mohan babu) సహా చాలా పెద్ద హీరోలకు ఆహ్వానం అందిందన్నారు. ఆ ఆహ్వానం మోహన్‌బాబుకు అందించలేదని బాంబు పేల్చారు. దీనిపై ఫిల్మ్‌ ఛాంబర్‌లో ( Film Chamber ) మాట్లాడతామన్నారు విష్ణు. ఆ ఆహ్వానం అందకుండా ఎవరు చేశారో తెలుసు. కానీ ఆ విషయం తాము ఇంటర్నల్‌గా మాట్లాడుకుంటామని మంచు విష్ణు తెలిపారు.  


వీటన్నింటిపై చర్చించేందుకు కీలకమైన వ్యక్తులంతా ఇవాళ ఫిల్మ్‌ ఛాంబర్‌లో సమావేశం అవుతున్నారు. దీనికి నిర్మాతల మండలి, ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్, డిస్టిబ్యూటర్స్‌ అసోసియేషన్, స్టూడియో సెక్టార్‌, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్, ఫిల్మ్‌ ఫెడరేషన్, డైరెక్టర్స్‌ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశానికి హాజరుకానున్నారు. 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన రెండు వందలకుపైగా ప్రతినిధులు 
ఈ భేటీలో పాల్గొంటారని తెలుస్తోంది. 


మా అధ్యక్షుడు మంచు విష్ణుతోపాటు సినీ పెద్దలు చిరంజీవి, మోహన్ బాబు, మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ సహా ఇతర ప్రముఖులంతా హాజరవుతారు. 


ఏపీ సీఎం జగన్‌తో భేటీ కంటే ముందే ఈ సమావేశం జరగాల్సి ఉండేది. కానీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇన్నాళ్లుకు ఇవాళ భేటీ అవ్వడానికి ప్రతినిధులు అంగీకరించారు. 


Also Read: ‘బెస్ట్‌సెల్లర్’ రివ్యూ: శృతిహాసన్‌లో మస్త్ షేడ్స్ ఉన్నాయ్! కానీ, పుస్తకమే..