దృశ్యం సినిమాలో తన కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురైన వ్యక్తి శవాన్ని మాయం చేస్తాడు హీరో. తన ఇంటి ఆవరణలోనే పాతి పెట్టిన శవాన్ని రాత్రికి రాత్రే నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి తరలిస్తాడు. తీరా పోలీసులు శవం కోసం హీరో ఇంటి వద్ద తవ్వితే అక్కడ ఓ దూడ కళేబరం బయటపడుతుంది. అక్కడితో మళ్లీ సస్పెన్స్ మొదలు.. సరిగ్గా ఇలాంటి సీన్ నెల్లూరు జిల్లాలో జరిగింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లులో ఓ రైతు పొలంలో కూడా ఇలాగే తవ్వి చూశారు పోలీసులు. సరిగ్గా ఇక్కడ కూడా వారు దేనికోసం తవ్వారో అది కనపడలేదు. షాకవడం పోలీసుల వంతు అయింది.
నెల్లూరు జిల్లా మినగల్లులో ఓ వ్యక్తిని హత్య చేసి ఓ రైతు పొలంలో పూడ్చి పెట్టారంటూ పుకారు షికారు చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తలు వైరల్ కావడంతో పోలీసులు దీనిపై దృష్టిపెట్టారు. వెంటనే ఆ రైతుని పిలిపించి మాట్లాడారు. తనకేపాపం తెలియదని చెప్పినా కుదరదన్నారు. విచారణ చేపట్టారు. రైతు పొలం వద్దకు వెళ్లి పరిశీలించారు. అన్నీ క్షుణ్ణంగా పరిశీలించినా అణుమాత్రం అనుమానంకూడా రాలేదు. ఓ చోట శవాన్ని పాతి పెట్టినట్టు ఆనవాళ్లు ఉండటంతో.. అక్కడ తవ్వాలని నిర్ణయించారు.
అందరిలో ఉత్కంఠ..
శవం పాతిపెట్టారనే వార్తల నేపథ్యంలో.. అక్కడ ఏదో పూడ్చి పెట్టినట్టు ఆనవాళ్లు ఉండటంతో అందరూ అలర్ట్ అయ్యారు. ఏదో జరిగే ఉంటుందనే పుకార్లు షికార్లు చేశాయి. అందరూ అక్కడికి చేరుకున్నారు. తీరా శవం కోసం గుంత తవ్వితే అక్కడ సినిమాలోని సీన్ మాదిరిగానే జరిగింది. దృశ్యం సినిమాలో లాగే అక్కడ మనిషి శవం కనపడలేదు. గొర్రెపిల్ల కళేబరం బయటపడింది. గ్రామంలో ఓ గొర్రెల కాపరికి చెందిన గొర్రెపిల్ల చనిపోగా దాన్ని అక్కడ పూడ్చిపెట్టినట్టు చెబుతున్నారు.
సినిమా సీన్ ని తలపించేలా..?
శవం కోసం పోలీసులు వెతికారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలతో ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు. తీరా అక్కడ చూస్తే అది గొర్రెపిల్ల కళేబరం. అక్కడితో ఆ మిస్టరీ వీగిపోయింది. అందరూ తేలికపడ్డారు. అయితే ఇది అచ్చు దృశ్యం సినిమా సీన్ ని తలపించడం మాత్రమే ఇక్కడ విశేషం. దృశ్యం సినిమాలో లాగా.. ఇక్కడ పోలీసులు ఒకదానికోసం వెదికితే మరొకటి దొరికింది. గొర్రెపిల్ల కళేబరం బయటపడిన తర్వాత మరికొన్ని అనుమానాలు మొదలయ్యాయి. అది అడవి జంతువు కణితి పిల్ల కళేబరమా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. దాన్ని కూడా నివృత్తి చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పశువుల ఆస్పత్రి వైద్యుల్ని సంప్రదించారు. మొత్తమ్మీద శవం కోసం వెదుకులాట మొదలుపెట్టారనే వార్త నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో కలకలం రేపింది.