Uttar Pradesh Crime News: పట్టుమని పాతికేళ్లు కూడా లేని ఓ అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తి అత్యంత కిరాతకంగా చంపేశారు. ఆపై అనేక ముక్కలు చేసి వాటిని ఓ బావిలో పడేశారు. అయితే ఆ బావి రోడ్డు పక్కనే ఉండటం, విపరీతమైన వాసన వస్తుండటంతో... స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


మృతదేహాన్ని ముక్కలు చేసి, బావిలో పడేసి..


ఉత్తర ప్రదేశ్ లోని ఆజంగఢ్ లో దారుణం జరిగింది. 22 ఏళ్ల యువతిని అతి కిరాతకంగా చంపి.. ఆపై అనేక ముక్కలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆపై ఆ మృతదేహం ముక్కలను ఓ సంచిలో వేసి మరీ రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడేసి వెళ్లిపోయారు. విపరీతమైన వాసన వస్తుంటే.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటినా రంగంలోకి దిగిన పోలీసులు.. బావిలోంచి మృతదేహాన్ని బయటకు తీశారు. ఫోరెన్సిక్ టీమ్, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. ప్రస్తుతం ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అహ్రాలా పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 


దిల్లీలోనూ ఇలాంటి తరహా ఘటనే


దిల్లీలో తనతో సహజీవనం చేసిన యువతిని హత్య చేసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికిన అఫ్తాబ్ అమీన్ పూనావాలా గురించి రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. 28 ఏళ్ల యువకుడు ఇంత కిరాతకంగా హత్య చేసి, దీని నుంచి తప్పించుకునేందుకు చేసిన పనులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అయితే ఆ యువకుడు 'డెక్స్‌టర్' అనే డ్రామా వెబ్ సిరీస్ ద్వారా 'స్పూర్తి' పొందాడని దర్యాప్తులో తేలింది. డెక్స్‌టర్ అనేది సీరియల్ కిల్లింగ్స్‌కు సంబంధించిన ఓ క్రైమ్ సిరీస్. ఇందులో వ్యక్తి పోలీసులకు ఫోరెన్సిక్ టెక్నీషియన్‌గా పని చేస్తాడు. కానీ ఖాళీ సమయంలో క్రూరమైన నేరస్థులను చంపుతూ ఉంటాడు. ఈ సిరీస్ చూసిన అఫ్తాబ్.. ఇందులో చూపించినట్లుగా ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించినట్లు తేలింది. కాల్ సెంటర్‌లో చేరడానికి ముందు అఫ్తాబ్ చెఫ్‌గా పని చేసినట్లు సమాచారం. కాబట్టి శరీరాన్ని కత్తి సాయంతో ఎలా కట్ చేయాలో అఫ్తాబ్‌కు బాగా తెలుసు. అఫ్తాబ్ ఒక రిఫ్రిజిరేటర్‌ని తీసుకువచ్చాడని, అందులోనే శ్రద్ధా శరీర భాగాలను 18 రోజుల పాటు దాచినట్లు అధికారులు తెలిపారు. అఫ్తాబ్, శ్రద్ధ.. ముంబయిలోని ఓ కాల్ సెంటర్‌లో పనిచేశారు. అక్కడ వారు మొదట కలుసుకున్నారు. తరువాత డేటింగ్ ప్రారంభించారు. ఆమె కుటుంబం వారి సంబంధాన్ని ఆమోదించకపోవడంతో ఈ జంట దిల్లీకి పారిపోయి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవిస్తున్నారు. అయితే శ్రద్ధా తల్లిదండ్రులు మాత్రం.. ఆమె సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తమ కుమార్తె యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. కానీ చాలా కాలంగా ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో శ్రద్ధ తండ్రి దిల్లీకి వచ్చారు. తన కూతురు వివరాలు తెలియకపోవడంతో ఆమె తండ్రి దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.