నటుడు ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన విలక్షణ నటనతో భిన్న భాషల్లో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ప్రకాశ్ రాజ్ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉంటారు. రాజకీయంగా ఆయన చేసే విమర్శలు చర్చనీయాంశం అవుతుంటాయి. తాను అనుకున్న మాటను నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. ఇటీవల తమిళ నటుడు హీరో విశాల్ కాశీలో పర్యటించారు. అక్కడ ఏర్పాట్లు, సౌకర్యాలు బాగున్నాయని ప్రధాని మోడీ కు ధన్యవాదాలు చెప్తూ ట్వీట్ చేశారు. దీనికి ప్రకాశ్ రాజ్ కూడా ఘాటుగా స్పందిస్తూ రీ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇలా ఆయన మాటలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రకాశ్ చేస్తోన్న విమర్శలు తన సినిమా జీవితం పై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే అది నిజమని అనిపిస్తుంది. రాజకీయంగా తాను చేసే విమర్శల వల్ల తనకు సినిమా అవకాశాలు తగ్గుతున్నాయని అన్నారు. 


గతంలో తనతో కలిసి పని చేసిన వారు ఇప్పుడు కలసి నటించడానికి భయపడుతున్నారన్నారు. తనతో నటిస్తే ఏమవుతుందో అని వారు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ లో కొంతమంది స్టార్ లు తనతో నటించడానికి ఇష్టపడటం లేదని, అయితే దక్షిణాది రాష్ట్రాల్లో  మాత్రం అలాంటి పరిస్థితి రాదని ధీమా వ్యక్తం చేశారు. కొంతమంది నిర్ణయం వల్ల తనకు ఏ మాత్రం నష్టం లేదని, దానికోసం  బాధపడను అని పేర్కొన్నారు. తన భయం మరొకరికి శక్తిగా మారకూడదని, తనకు సినిమా అవకాశాలు రాకపోయినా పర్లేదన్నారు. తాను మాత్రం తగ్గనని, రూటు మార్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 


చాలా మంది నటులు సామాజిక, రాజకీయ విషయాలపై ఎందుకు మాట్లాడరో తాను అర్థం చేసుకోగలను అన్నారు ప్రకాష్ రాజ్. వారిని నేనేమి నిందించడం లేదని, ఎందుకంటే దానిని వారు తట్టుకోలేకపోవచ్చని అన్నారు. స్పందించనంత మాత్రానా వారు తప్పు చేసినట్లు కాదన్నారు. తాను మాత్రం వెనకడుగు వేయనన్నారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు అటు ఇండస్ట్రీలో ఇటు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.


ప్రకాశ్ రాజ్ చివరిసారిగా దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియిన్ సెల్వన్ 1లో కీలక పాత్ర పోషించారు. నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఒక్క తమిళ్ లోనే 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాల లిస్ట్ లో చేరింది. ఈ సినిమా ను 500 కోట్ల తో రెండు భాగాలుగా తెరకెక్కించారు. మొదటి భాగానికే దాదాపు వసూళ్లు వచ్చేశాయి. మొదటి భాగం హిట్ కావడంతో సెకండ్ పార్ట్ పై ఆసక్తి పెరిగింది. ఇక ఈ సినిమా రెండో భాగాన్ని కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు మేకర్స్. అలాగే ప్రకాశ్ రాజ్ ఇటీవల విడుదలైన ముఖ్బీర్ – ది స్టోరీ ఆఫ్ ఎ స్పై వెబ్ సిరీస్‌లో కూడా కీలక పాత్ర పోషించాడు.