US Utah Shooting:


ఇంట్లో కాల్పులు


అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఉటాహ్‌ రాష్ట్రంలో గన్ ఫైరింగ్‌లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 5గురు చిన్నారులే. ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో వీరంతా అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై ప్రస్తుతానికి అధికారులు పూర్తి స్థాయి సమాచారం ఇవ్వలేదు. 8 వేల మంది నివసించే ఓ చిన్న టౌన్‌లో ఈ ఘటన జరిగినట్టు వెల్లడించారు. ఫలితంగా...స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఎవరు ఈ పని చేశారు..? ఎందుకు చేశారు..? అన్న అంశాలపై విచారణ కొనసాగుతోంది. త్వరలోనే నిందితుడుని పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. "నేను వెళ్లే చర్చ్‌కు వాళ్లూ వస్తారు. నాకు ఆ కుటుంబం అంతా పరిచయమే. వాళ్లకు ఇలా జరగడం షాకింగ్‌గా ఉంది. ఇరుగు పొరుగు వాళ్లతో ఎంతో ప్రేమగా ఉండేవాళ్లు" అని స్థానికుడు చెప్పాడు. 2023 మొదలై ఐదు రోజులు అవుతోంది. మొదటి మూడు రోజుల్లోనే అమెరికాలో గన్‌ ఫైరింగ్‌తో చనిపోయిన వారి సంఖ్య పెరిగిపోయింది. కేవలం ఈ మూడు రోజుల్లో 130 మంది చనిపోగా...300 మంది గాయపడ్డారు. కొందరు అనుకోకుండా చనిపోతే.. మరి కొందరు హత్యకు గురయ్యారని స్థానిక సంస్థ వెల్లడించింది. క్రిస్‌మస్‌ వేడుకల ముందు కూడా ఓ మాల్‌లో భారీగా కాల్పులు జరిగాయి. 


గన్ కల్చర్‌..


అమెరికాలో గన్ కల్చర్ ఏ స్థాయిలో పాతుకుపోయిందో ఇటీవలి ఘటనలే స్పష్టం చేస్తున్నాయి. ఉన్నట్టుండి జేబులో నుంచి తుపాకీ తీసి ఇష్టమొచ్చినట్టు కాల్చి పడేస్తున్నారు చాలా మంది. ఈ కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చిన్నారులూ ఉంటున్నారు. ఒక్కోసారి స్కూల్స్‌పైనా దాడులు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే వారం రోజులకో కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాణనష్టమూ భారీగానే నమోదైంది. ఈ ఘటనలపై పూర్తి స్థాయి అధ్యయనం చేసి...ఓ రిపోర్ట్ విడుదల చేసింది JAMA Network Open మెడికల్ జర్నల్. గతేడాది అమెరికాలో కాల్పుల కారణంగా ప్రాణాలు  కోల్పోయిన వారి సంఖ్యగా రికార్డు స్థాయిలో నమోదైందని వెల్లడించింది. మూడు దశాబ్దాల రికార్డుని చెరిపేసిందని తేల్చి చెప్పింది. ఈ కాల్పుల ఘటనల్లో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా చనిపోతున్నారని  తెలిపింది. 1990 నుంచి 2021 వరకూ అమెరికాలో 11 లక్షల 10 వేల 421 మంది తూటాలకు బలి అయ్యారని The Hill రిపోర్ట్ వెల్లడించింది. మహిళలు ఎక్కువగా బాధితులవుతుండగా..వీరిలో నల్లజాతికి చెందిన  మహిళలనే ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నట్టు నివేదిక తెలిపింది.మొదట్లో భద్రత కోసం తుపాకి ఉంటే మంచిదని భావించిన అమెరికన్ల సంఖ్య కాస్త తక్కువగానే ఉండేది. రానురాను ఇది ప్రెస్టేజ్ సింబల్‌గా మారింది. చేతిలో లైసెన్స్‌డ్ తుపాకీ ఉండటాన్ని హోదాగా భావించే ధోరణి పెరిగింది. ఫలితంగా కుటుంబంలో కనీసం ఒక్కరైనా తుపాకీ కొనుగోలు చేస్తున్నారు. తమ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే గన్ తప్పనిసరిగా ఉండాల్సిందే అనుకునే వారి సంఖ్య పెరగటం వల్ల క్రమంగా గన్‌ కల్చర్‌ దారి తప్పింది.


Also Read: Kanjhawala Delhi Case: కంజావాలా కేసులో మరో చిక్కుముడి, సీసీటీవీ ఫుటేజ్‌పై అనుమానాలు