ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బలోపేతం దిశగా బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ స్పీడ్‌గా వర్క్ చేస్తున్నారు. ఏపీలో పార్టీలో చేరే వారి జాబితా సిద్ధం చేస్తున్నారు. దీనిపై ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌తో చర్చించారు. 


ప్రగతి భవన్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో ఏపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ భేటీ అయ్యారు. ఆయనతోపాటు చింతల పార్థసారథి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీలో పార్టీ బలోపేతంపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. ఏపీలో వరుస సమావేశాలు ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఓ భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారు. దీనికి వేదిక, టైం, డేట్ ఫిక్స్ చేయనున్నారు. ఈ సభ తర్వాత ఏపీలో చేరికలు చాలా ఉంటాయని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అదే ఊపుతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేయాలని చంద్రశేఖర్‌కు కేసీఆర్ సూచించారు. 


బీఆర్‌ఎస్‌ లక్ష్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు కేసీఆర్. భారీ ఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టాలన్నారు. గ్రామ, మండ, జిల్లా కమిటీలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. ఏపీ స్టేట్‌ ఆఫీస్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించాలని కూడా చెప్పారు.


ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత చంద్రశేఖర్‌ తొలిసారిగా సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఏపీలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా కీలక విషయాలపై కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్‌ ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తనను నియమించినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో బీజేపీ ఢీ కొట్టే సత్తా బీఆర్‌ఎస్‌కే ఉందన్నారు. 






బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు ఉంటాయి: కేసీఆర్‌


ఏపీ నేతలు తోట చంద్రశేఖర్‌, రావెల కిషోర్‌బాబు, పార్థసారథి పార్టీలో చేరిన సందర్భంగా మాట్లాడిన కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మహోజ్వల భారత దేశం కోసమే బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. బీఆర్ఎస్ ఒక ప్రాంతానికి పరిమితం అయ్యే పార్టీ కాదన్నారు. లక్షల కిలోమీటర్ల ప్రయాణం ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుందన్నారు. ఎవరైనా ఏ విషయాన్ని గుర్తించడానికి మొదట ఒప్పుకోరన్నారు. కొంచెం గట్టిగా అరిస్తే అప్పుడు గుర్తిస్తారని అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రయాణం కూడా అలానే మొదలైందని కేసీఆర్ అన్నారు. ముందు అవహేళన చేసిన వాళ్లే ఆ తర్వాత దాడులకు పాల్పడతారని, ఆ తర్వాత మనకు విజయం సాధ్యమవుతుందన్నారు. ఎందుకు బీఆర్ఎస్ అనేది కార్యకర్తలకు చెప్పడానికి భవిష్యత్తులో క్లాసులు నిర్వహిస్తామని చెప్పారు. 






"బీఆర్ఎస్ దేశం పెట్టింది. బీఆర్ఎస్ అంటే తమాషా కాదు. గుణాత్మకమార్పు కోసమే బీఆర్ఎస్. మన దేశంలో లక్ష్యం ఎలా ఉందంటే ఏం చేసైనా ఎన్నికల్లో గెలవాలి. ఇదే లక్ష్యంగా మారిపోయింది. మతాల మధ్య చిచ్చుపెట్టొచ్చు, కులాల కుంపట్లు పెట్టొచ్చు, విద్వేషాలు రెచ్చగొట్టొ్చ్చు. ఏదైనా చేసి ఎన్నికలు గెలవడమే లక్ష్యం అయిపోయింది. రాజకీయాల్లో ఉండాల్సిన లక్షణం ఇదే. రైతాంగం అంతా దిల్లీ పోయి ధర్నాలు చేశారు. సుమారు 750 మంది చనిపోయారు. వారికి సంతాపం చెప్పిన దాఖలాలు లేవు. ఎమ్మెల్యే కాగానే కొమ్ములొస్తున్నాయి. వారి భాష, వేషం, తీరు మారిపోతున్నాయి. ఇవి నాయకత్వ లక్షణాలు కాదు. సహజత్వానికి దూరంగా నాయకత్వం మారిపోతుంది." - సీఎం కేసీఆర్