Pulivenudla Shooting :  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. దిలీప్ , మస్తాన్  అనే వ్యక్తులపై భరత్  కుమార్ యాదవ్ కాల్పులు జరిపారు. వీరిద్దరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలోనే దిలీప్ చనిపోయారు. మస్తాన్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగానే వివాదం ఏర్పడినట్లుగా భావిస్తున్నారు. తనకు రావాల్సిన డబ్బుల విషయంలో మాటా మాటా పెరగడంతో భరత్ యాదవ్ ... తన ఇంటికి వెళ్లి ఇంట్లో దాచి ఉంచిన తుపాకీ తీసుకుని వచ్చి కాల్పులు జరిపారు.   


వివేకా హత్య కేసులో పలుమార్లు  భరత్ యాదవ్‌ను ప్రశ్నించిన సీబీఐ 


భరత్ కుమార్ యాదవ్ పేరు వైఎస్ వివేకా హత్య కేసులో కూడా వినిపించింది. ప్రస్తుతం వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ సమీప బంధువే భరత్ కుమార్ యాదవ్. సీబీఐ ఆయనను కూడా వివేకా కేసులో ప్రశ్నించింది. వివేకానందరెడ్డి హత్య ఘటనకు వివాహేతర సంబంధాలు, సెటిల్మెంట్లే కారణమని తరచూ మీడియా మందుకు వచ్చి చెబుతూ ఉంటారు.   సీబీఐ పై కూడా భరత్ కుమార్ యాదవ్ ఆరోపణలు చేశారు. సునీత భర్త రాజశేఖర్ రెడ్డి నుంచి ప్రాణహానీ ఉందని మీడియా సమావేశాల్లో చెప్పారు.  గత ఏడాది ఫిబ్రవరిలో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తనను భరత్ యాదవ్   భయపెడుతున్నారని,  ప్రలోభ పెడుతున్నారని సీబీఐకి కూడా ఫిర్యాదు చేశారు.  


గతంలో తనను భరత్ యాదవ్ బెదిరించారని సీబీఐకి ఫిర్యాదు చేసిన దస్తగిరి           


భరత్ యాదవ్ తన ఇంటికి వస్తన్నారని అవినాష్ రెడ్డిని కలవాలంటున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. అయితే భరత్ యాదవ్ అప్పట్లో రివర్స్ ఆరోపణలు చేశారు.  దస్తగిరి ని సీబీఐ వాళ్ళు ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తనకు రావాల్సిన డబ్బులు దస్తగిరి ని అడిగానని ...  కావాలనే దస్తగిరి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఆ వివాదం తర్వాత  భరత్ యాదవ్ మరోసారి ప్రెస్ మీట్ పెట్టి సీబీఐపై, వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఓ  పత్రికకు జర్నలిస్టుగా పని చేస్తానని  భరత్ యాదవ్ పులివెందులలో ప్రచారం చేసుకుంటూ ఉంచారు. 


భరత్ యాదవ్ పోలీసుల అదుపులో ఉన్నారా ?                        


భరత్ కుమార్ యాదవ్ పోలీసుల అదుపులో ఉన్నారో లేదో స్పష్టత లేదు. కాల్పుల తర్వాత ఆయన సంఘటనా స్థలం నుంచి పరారైనట్లుగా తెలుస్తోంది. ఆయనకు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనేది మిస్టరీగా మారింది. ఈ కేసులో అసలు వారి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు ఎందుకు.. అందరూ కలిసి సెటిల్మెంట్లు ఏమైనా చేస్తున్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరిపే అవకాశం ఉంది. అయితే అధికారికంగా పోలీసులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.