Multibagger Penny Stock: గత ఏడాది కాలం నుంచి మొత్తం ప్రపంచ స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలంగా ఉన్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) భారత మార్కెట్లలో నిరంతరం నెట్‌ సెల్లర్స్‌గా కొనసాగుతున్నారు, స్టాక్ మార్కెట్ల పనితీరు పేలవంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని పెన్నీ స్టాక్స్‌ బ్రహ్మాండంగా రాణించాయి, పెట్టుబడిదార్లకు మల్టీబ్యాగర్ రాబడిని అందించాయి. అటువంటి మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్స్‌లో ఒకటి రాజ్ రేయాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Raj Rayon Industries Ltd). ఇది గత ఏడాదిన్నర కాలంలోనే తన ఇన్వెస్టర్లకు అత్యంత భారీగా 225 రెట్ల లాభాన్ని అందించింది.


గత కొన్ని రోజుల నుంచి నష్టం
ఈ స్టాక్‌కి ఇటీవలి రోజులు మంచిగా లేవు. ఇవాళ (28 మార్చి 2023‌) రాజ్ రేయాన్ షేరు రెండు శాతం పతనమై రూ. 66.50 వద్ద ముగిసింది. దీని ధర గత ఐదు రోజుల్లో 7.64 శాతం, గత నెల రోజుల్లో 16.72 శాతానికి పైగా తగ్గింది. అయినా, ఇప్పటికీ రాజ్ రేయాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మల్టీబ్యాగర్ స్టాక్స్‌ లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉంది.


ధర ఇలా పెరిగింది
రాజ్ రేయాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్‌ ధర 17 నెలల క్రితం కేవలం 30 పైసలు మాత్రమే. అక్టోబర్ 01, 2021న ఈ షేర్ ధర 30 పైసల వద్ద ముగిసింది. ఆ తర్వాత అది ఎంత స్పీడ్‌ని పుంజుకుందంటే, అప్పటి వరకు ఉన్న దిగ్గజ స్టాక్స్‌ అన్నీ మైళ్ల దూరం వెనుకబడిపోయాయి. ఇప్పుడు రూ. 66.50 కి చేరుకుంది. ఈ ధరతో పోలిస్తే, ఈ స్టాక్ గత 17 నెలల్లో దాదాపు 22,516% రాబడిని తీసుకొచ్చింది.


ఈ నెల ప్రారంభంలో ఈ షేరు తన ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ. 89.75కి చేరుకుంది. ఆ స్థాయి నుంచి ఇప్పటి వరకు దాదాపు 25 శాతం పడిపోయింది. 


ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు చూస్తే... ఇది రూ. 36.90 నుంచి దాదాపు 84 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో ఈ షేరు ధర రూ. 16.80 నుంచి ఇప్పటి రూ. 66.50 కు చేరింది. ఈ కాలంలో దాదాపు 300 శాతం ‍‌(295.83%) పెరిగింది.


తారాజువ్వలా పెరిగిన పెట్టుబడిదార్ల సంపద
నెల రోజుల క్రితం ఈ స్టాక్‌లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే.. ఈ రోజు అతని పెట్టుబడి విలువ 85 వేల రూపాయలకు తగ్గి ఉంటుంది. అదేవిధంగా ఈ ఏడాది ప్రారంభంలో రూ. లక్ష పెట్టుబడి పెడితే, ఇప్పుడు రూ. 1.84 లక్షలుగా ఉండేది. ఆరు నెలల క్రితం రూ. లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు రూ. 3 లక్షల వరకు వచ్చేది. 17 నెలల ముందు, అంటే అక్టోబర్ 2021లో ఎవరైనా ఈ స్టాక్‌లో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, అప్పుడు అతని పెట్టుబడి విలువ ₹2.25 కోట్లకు పెరిగి ఉండేది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.