Hyderabad Tourists Died Due To Falling Rocks In Uttarakhand: ఉత్తరాఖండ్ (Uttarakhand) చమోలీలో (Chamoli) శనివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ పర్యాటకులు (Hyderabad Tourists) ప్రాణాలు కోల్పోయారు. అక్కడ కొండ చరియలు విరిగిపడడంతో బండరాళ్లు ఢీకొని వీరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బద్రీనాథ్ జాతీయ రహదారిపై చత్వాపీపాల్ సమీపంలో గౌచర్, కర్ణప్రయాగ్ మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన నిర్మల్ షాహి (36), సత్యనారాయణ (50)లు హిమాలయ దేవాలయం నుంచి మోటార్ సైకిల్‌పై తిరిగి వస్తుండగా.. కొండపై నుంచి పడ్డ బండరాళ్లు వీరిని ఢీకొట్టినట్లు చెప్పారు. కొండచరియలు విరిగిపడిన శిథిలాల నుంచి వీరి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, కొండచరియలు విరిగిపడడంతో బద్రీనాథ్ నేషనల్ హైవేపై పలు చోట్ల ధ్వంసమై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రుద్రప్రయాగ్ - కేదార్ నాథ్ జాతీయ రహదారిపైనా రాకపోకలు నిలిచిపోయాయి.


కాగా, ఉత్తరాఖండ్ వ్యాప్తంగా భారీ వర్షాలతో నదులన్నీ నిండి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. శని, ఆదివారాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలతో ముందుజాగ్రత్తగా రుద్రప్రయాగ్‌లోని అన్ని స్కూళ్లకు విద్యా శాఖ సెలవు ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


Also Read: Road Accident: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం - వేర్వేరు చోట్ల ఘోర ప్రమాదాల్లో 9 మంది మృతి