Tirupati Ragging: తిరుపతిలోని చంద్రగిరి బాలికల హాస్టల్ లో ర్యాగింగ్ కలకలం రేగింది. ఓ గ్రూపుగా ఏర్పడిన అమ్మాయిల గ్యాంగ్ ఇతర అమ్మాయిలను ర్యాగింగ్ చేస్తున్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. ర్యాగింగ్ చేసే గ్యాంగ్ వేధింపులు భరించలేని ఓ అమ్మాయి వారి నుంచి తప్పించుకోవడానికి, ఆ హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లిపోవడానికి చేసిన ప్రయత్నంతో ఈ ర్యాగింగ్ అంశం బయటకు వచ్చింది. చంద్రగిరి ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లో తిరుపతి గ్రామీణం మండలానికి చెందిన ఓ బాలిక ఉంటూ.. చంద్రగిరి పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. వసతి గృహంలో ఉండే కరకంబాడికి చెందిన ఓ విద్యార్థిని ఆ బాలికను రోజూ ర్యాగింగ్ చేస్తోంది. తన వేధింపులు తీవ్రం కావడంతో ఆ బాధ భరించలేకపోయింది బాధిత బాలిక. ఇంటికి వెళ్లిపోతే ఈ ర్యాగింగ్ భూతం నుంచి తప్పించుకోవచ్చని భావించింది. 




ఆదివారం అర్ధరాత్రి మరో విద్యార్థిని చేత తన వెంట్రుకలను కత్తిరించుకుంది. తన వెంట్రుకలను కత్తిరించి ర్యాగింగ్ చేస్తున్నారని, హాస్టల్లో ఉండలేనని తల్లిదండ్రులకు చెప్పుకుంది. దీంతో ఆ విద్యార్థిని తల్లి వసతి గృహానికి చేరుకుని విచారించగా కరకంబాడికి చెందిన విద్యార్థిని ర్యాగింగ్ విషయం తెలిసింది. ఇంటికి వెళ్ళిపోయేందుకు సాకు కోసం వెంట్రుకలు కత్తిరించుకున్నట్లు బాధిత విద్యార్థిని చెప్పినట్లు తేలింది. ర్యాగింగ్ చేస్తూ అమాయక బాలికలను టార్గెట్ చేస్తూ రకరకాల పనులు చెబుతూ వేధింపులకు పాల్పడుతున్న కరకంబాడికి చెందిన విద్యార్థినిపై 100కు డయల్ చేసి విషయం చెప్పారు బాధిత బాలిక తల్లి. వారు చంద్రగిరి పోలీసులతో కాన్ఫరెన్స్ పెట్టగా.. స్థానిక పోలీసులు బాధిత బాలికను, కత్తిరించిన జుట్టును స్టేషన్ కు తీసుకురావాల్సిందిగా చెప్పారు. దీంతో పోలీసు స్టేషన్ కు వెళ్లడం ఇష్టం లేని బాధిత బాలిక తల్లి.. ర్యాగింగ్ విషయంపై హాస్టల్ వార్డెన్ వహిముద్దీన్ కు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్ విషయంపై విచారించి చర్యలు తీసుకుంటానని వార్డెన్ తెలిపారు.