Visakha Express Robbery : భువనేశ్వర్, సికింద్రాబాద్ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మరోసారి దోపిడీకి దుండగులు యత్నించారు. అయితే ట్రైన్‌లో ఉన్న రైల్వేపోలీసుల అప్రమత్తతతో వారి ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ట్రైన్‌లో ఈ ఘటన తర్వాత కలకలం రేగింది. ప్రయాణికులు నిద్రలేని రాత్రి గడిపారు. 

సికింద్రాబాద్ వస్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మరోసారి కలకలం రేగింది. ఇప్పటికే పలు మార్లు ఈ ట్రైన్‌లో దోపిడీకి యత్నించిన దుండగులు ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేసి విఫలమయ్యారు. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. దాదాపు ఏడుగురు సభ్యులు ముఠా ఈ ఉదయం ట్రైన్‌లో దోపిడీకి ప్రయత్నించింది. కానీ ట్రైన్‌లో ఉన్న రైల్వే పోలీసులు అలర్ట్ అయ్యారు. చోరీ విషయాన్ని గమనించి గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. 

పోలీసులు అలర్ట్‌ అవ్వడంతో దోపిడీ దొంగలు ట్రైన్ దిగి పారిపోయారు. పది రోజుల వ్యవధిలో ఇలా దోపిడీకి స్కెచ్ వేయడం ఇది మూడోసారి. ఇప్పటికే రెండుసారు దొంగలు తాము అనుకున్నది సాధించారు. కానీ ఈసారి మాత్రం పోలీసులు అలర్ట్‌గా ఉన్నారు. ఆదివారం కూడా అలానే అప్రమత్తంగా ఉండటంతో దోపిడీ బ్యాచ్ ప్లాన్ వర్కౌట్ కాలేదు. బిహార్, మహారాష్ట్రాకు చెందిన గ్యాంగ్‌లే ఇలా దోపిడీకి పాల్పడుతున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.