Prasidh Krishna Comments: ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో బౌలింగ్ వైఫల్యం కారణంగా టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 370+ పరుగుల టార్గెట్ నిర్దేశించినప్పటికీ, ఓడిపోవడంతో భారత అభిమానులు కంగుతిన్నారు. నిజానికి భారత్ 350కి పైగా పరుగుల టార్గెట్ నిచ్చిన ప్రతీసారి గెలిచింది. ఒక్క ఇంగ్లాండ్ విషయంలో ఈ అంచనా తప్పింది. మూడేళ్ల కిందట 378 పరుగుల టార్గెట్ నిచ్చి బజ్ బాల్ కారణంగా ఏడు వికెట్లతో ఓడిపోగా, తాజాగా ఐదు వికెట్లతో మరోసారి ఆతిథ్య జట్టు చేతిలో పరాజయం పాలైంది. అయితే ఈ ఓటమికి బాధ్యత తనదేనని భారత పేసర్ ప్రసిధ్ కృష్ణ ఒప్పుకున్నాడు. ఈ మ్యాచ్ లో తను ఘోరంగా విఫలం అయ్యాడు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ ఆరు పరుగులకు పైగా ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు.
సరైన లైన్ అండ్ లెంగ్త్..ఇక లీడ్స్ లో జరిగిన ఈ టెస్టులో సరైన లైన్ అండ్ లెంగ్త్ లో బౌలింగ్ చేయడంలో తాను విఫలమయ్యానని ప్రసిధ్ తెలిపాడు. వికెట్ కు అనుగుణంగా కంటే ఎక్కువగా షార్ట్ ఆఫ్ లెంగ్త్ బంతులు విసిరి, భారీగా పరుగులు సమర్పించుకున్నాని తెలిపాడు. నిజానికి తొలి ఇన్నింగ్స్ లో పిచ్ స్వభావానికి అడ్జస్ట్ అయ్యేందుకు సమయం తీసుకున్నానని, అయితే ప్రొఫెషనల్ గా తను మరింత బాగా బౌలింగ్ చేస్తే బాగుండేదని వాపోయాడు. ఈ ఇన్నింగ్స్ లో 20 ఓవర్లు వేసి 128 పరుగులు సమర్పిచుకున్నాడు. ఎకానమీ రేటు 6.4 కావడం గమనార్హం. టెస్టు ఇన్నింగ్స్ లో 20 ఓవర్లు వేసిన బౌలర్లలో ఇదే చెత్త ఎకానమీ రేటు కావడం విశేషం. ఇక రెండో ఇన్నింగ్స్ లో 15 ఓవర్లు వేసి 92 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక్కడ కూడా 6.1తో పరుగులిచ్చాడు.
మెయిడిన్ వేయడానికే..తానేప్పడు బౌలింగ్ చేసినా, పరుగులు ఆపి, వీలైతే మెయిడిన్ వేసేందుకు ప్రయత్నిస్తుంటానని ప్రసిధ్ చెప్పుకొచ్చాడు. కావాలని బౌండరీ బాల్స్ ని ఇవ్వబోనని పేర్కొన్నాడు. అయితే తొలి టెస్టులో మాత్రం తన అంచనా తప్పిందని, అయితే రెండో ఇన్నింగ్స్ లో అనుకున్నదానికంటే మెరుగ్గా బౌలింగ్ చేసినట్లు తెలిపాడు. ఈ టెస్టులో ఐదు వికెట్లతో తను రాణించినా, భారీగా పరుగులు సమర్పించుకుని జట్టు ఓటమికి మెయిన్ దోషీగా మారాడు. ఇక జూలై 2 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో భారత జట్టులో మార్పుల చేసే అవకాశముంది. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా దూరమైనట్లు తెలుస్తోంది. ప్రసిధ్ ను కూడా పక్కన పెట్టే అవకాశముంది.