India Vs England 1st t20 News: ఇంగ్లాండ్ పర్యటనలో భారత స్టాండిన్ కెప్టెన్ స్మృతి మంధాన సెంచరీ (62 బంతుల్లో 112, 15 ఫోర్లు, 3 సిక్సర్లు)తో అదరగొట్టింది. శనివారం నాటింగ్ హామ్ వేదికగా జరిగిన తొలి టీ20లో కెరీర్ లో తొలి టీ20 సెంచరీ సాధించడంతో 5 టీ20ల సిరీస్ లో భారత్ శుభారంభం చేసింది.
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 210 పరుగులు చేసింది. స్మృతి టాప్ స్కోరర్ గా నిలవగా, ఇంగ్లాండ్ తరపున లారెన్ బెల్ కు మూడు వికెట్లు దక్కాయి. భారీ టార్గెట్ తో ఛేజింగ్ కు దిగిన ఆతిథ్య జట్టు 14.5 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ చేతిలో 97 పరుగులతో పరాజయం పాలైంది. నాట్ స్కీవర్ బ్రంట్ కెప్టెన్ ఇన్నింగ్స్ (42 బంతుల్లో 66, 10 ఫోర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచింది. బౌలర్లలో శ్రీచరణి నాలుగు వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
స్మృతి సూపర్ సెంచరీ..ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియాకు మరో ఓపెనర్ షెఫాలీ వర్మ (20) తో కలిసి తొలి వికెట్ ఉ 77 పరుగులను స్మృతి జోడించింది. ఆరంభంన ఉంచి అగ్రెసివ్ గా ఆడిన స్మృతి.. ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడింది. దీంతో పవర్ ప్లేలో 47 పరుగులు వచ్చాయి. కాసేపటికే 27 బంతుల్లోనే ఫిఫ్టీని స్మృతి పూర్తి చేసుకుంది. ఈ మధ్యలో షెఫాలీ ఔటైనా..హర్లీన్ డియోల్ (43)తో కలిసి మరో ఉపయుక్తమైన పార్టనర్ షిప్ ను నమోదు చేసింది. వీరిద్దూ రెండో వికెట్ కు 94 పరుగులు జోడించడంతో జట్టు పటిష్టస్థితికి చేరుకుంది. ఆ తర్వాత డియోల్ ఔటైనా.. స్మతి ఆఖరి ఓవర్ వరకు నిలిచి 51 బంతుల్లో శతకాన్ని కంప్లీట్ చేసింది. ఈ ఫార్మాట్ లో తొలి సెంచరీ పూర్తి చేసింది. దీంతో మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. అలాగే టీమిండియా తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసింది.
టపాటపా..ఇక భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఏ దశలోనూ లక్ష్యం వైపు కదులుతున్నట్లు అనిపించలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి, ఓటమికి మానసికంగా సిద్ధమైంది. కెప్టెన్ బ్రంట్ పోరాడటంతో ఓటమి అంతరం కాస్త తగ్గింది. ఆఖరికి 15 ఓవర్లలోపై ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్ ముగియడం విశేషం. మిగతా బౌలర్లలో దీప్తీ శర్మ, రాధా యాదవ్ లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఈ అద్భుత విజయం తో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 1-0తో భారత్ ఆధిక్యంలో నిలిచింది. స్మృతికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్దు దక్కింది. సిరీస్ లో తర్వాత మ్యాచ్ జూలై 1న బ్రిస్టల్ లో జరగుతుంది.