Free Bus For Women In Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని ప్రారంభించాలని చూస్తున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు చాలా రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేసినా ఏపీ అత్యుత్తమం అవుతుందని చంద్రబాబు చెబుతున్నారు.
ఇప్పటి వరకు ఎవరూ అమలు చేయనట్టుగా....
మహిళలకు ఉచిత ప్రయాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేశారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఈ ఉచిత బస్ పథకం అమలు అవుతోంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధానం పాటిస్తున్నారు. అన్నింటిపై అధ్యయనం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త విధానం తీసుకొస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని మహిళలంతా ఆనందపడేలా ఉంటుందని పేర్కొన్నారు.
రద్దీకి తగట్టు ఏర్పాట్లు చేయాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థిక కష్టాలు ఇంకా వెంటాడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అయినా వాటిని అధిగమించి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చాలా వరకు అమలు చేశామని ఇప్పుడు బస్ పథకాన్ని అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. ఈ పథకం అమలు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఎక్కడా ఎవరూ అసంతృప్తి లేకుండా పక్కా ప్రణాళికతో అమలు చేయబోతున్నట్టు తెలిపారు. ఉచిత బస్ హామీ అమలు అయితే రద్దీ పెరుగుతుందని అందుకు తగ్గట్టు బస్‌లు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరం అయితే అద్దెకు తీసుకోవాలని సూచించారు.
90 శాతం మంది మహిళలు ప్రయాణం
ఉచిత బస్ పథకం అమలు అయితే రాష్ట్రంలో దాదాపు 90 శాతం మంది మహిళలు ఆర్టీసీ బస్‌లు ఎక్కుతారని చంద్రబాబు అంచనా వేశారు. ఇప్పటికే ఏటా దాదాపు 43కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఆర్టీసీల్లో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు పథకం అమలు చేస్తే కచ్చితంగా ఇది 75 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆర్టీసీని సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ఇప్పుడు ఉన్న బస్‌లు అందుకు సరిపోవని అంచనాకు వచ్చారు. కొత్తగా దాదాపు 2500 బస్‌లు కొనుగోలు చేయాల్సి వస్తుందని దీనికి వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందని తేల్చారు. ఈ విషయంలో వివిధ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు చంద్రబాబు. వచ్చే వారం సమీక్ష నాటికి వీటిపై సమగ్రంగా దర్యాప్తు చేసి నివేదికతో రావాలని సూచించారు.
శనివారం నిర్వహించిన సమీక్షలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసే బస్‌లు అన్నీ ఈవీలై ఉంటాయన్నారు. ఇప్పుడు ఉన్న బస్‌లను కూడా ఈవీలుగా మార్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈవీల కొనుగోలు విషయంలో ఉన్న ప్రతిపాదనలు పరిశీలించాలన్నారు. బ్యాటరీతో కొనుగోలు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది... బ్యాటరీ లేకుండా కొనుగోలు చేస్తే ఎంత ఖర్చు అవుతుందని అనేది కూడా స్టడీ చేయాలని చెప్పుకొచ్చారు.