Kolkata Doctor Murder Case: కోల్‌కతా ఆర్‌జీ కార్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్ ఘోష్‌ని సీబీఐ వరుసగా మూడో రోజు విచారించింది. ఇప్పటికే రెండు రోజుల పాటు అర్ధరాత్రి వరకూ ప్రశ్నించింది. ఇవాళ మరోసారి విచారణ జరిపింది. ఈ క్రమంలోనే కొన్ని కీలక ప్రశ్నలు అడిగింది. ఈ ప్రశ్నలకు సందీప్ ఘోష్ ఇచ్చే సమాధానాలే కేసులో కీలకం కానున్నాయి. అయితే..సీబీఐ అధికారులు అతను ఇచ్చే సమాధానలతో సంతృప్తిగా లేరని తెలుస్తోంది. అందుకే హాస్పిటల్ సిబ్బందినీ పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. అయితే...సందీప్ ఘోష్‌ని అడిగిన ప్రశ్నల జాబితా వెలుగులోకి వచ్చింది. 


ప్రశ్నలివే..


ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని అంత హడావుడిగా ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చిందని సీబీఐ అధికారులు సందీప్ ఘోష్‌ని ప్రశ్నించారు. నేరం జరిగిన స్థలంలో మరమ్మతులు ఎందుకు చేశారు..? మీరూ డాక్టరేగా..క్రైమ్‌ సీన్‌ని ఎలా ఉంచాలో మీకు తెలియదా..? అని అడిగారు. ఎవరి సలహా మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారని సందీప్ ఘోష్‌ని సీబీఐ ప్రశ్నించింది. విచారణ పూర్తయ్యేంత వరకూ సంఘటనా స్థలాన్ని సురక్షితంగా ఉంచాలని తెలిసి కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరా తీసింది. చనిపోయిందని తెలిశాక కూడా ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించడంలో ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించింది. అంతే కాదు. ఆమె మృతదేగాన్ని చూపించడానికి ఎందుకు ఆలస్యం చేశారనీ అడిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఎందుకు రాజీనామా చేశారని సందీప్ ఘోష్‌ని విచారించింది. ఈ ప్రశ్నలన్నింటికీ సందీప్ ఇంకా సమాధానం చెప్పాల్సి ఉన్నట్టు సమాచారం. ఈ హత్యాచార ఘటన జరిగిన రెండు రోజులకు రాజీనామా చేసిన సందీప్ ఘోష్ సాక్ష్యాధారాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలున్నాయి. అందులో భాగంగానే క్రైమ్ జరిగిన రూమ్‌లో మరమ్మతులు చేయించారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. 


కాల్ రికార్డ్‌లపై ఆరా..


ప్రస్తుతానికి సీబీఐ అధికారులు సందీప్ ఘోష్ కాల్ రికార్డ్‌లు, మెసేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఈ ఘటన జరగక ముందు, జరిగాక ఎవరెవరికి కాల్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికే ఈ ఘటనపై దేశమంతా భగ్గుమంటోంది. మెడికోలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. పలు చోట్ల వైద్య సేవల్ని నిలిపివేసి రోడ్లపైకి వచ్చి నినదిస్తున్నారు. న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే... ఇన్ని రోజుల పాటు విచారించడమే తప్ప అరెస్ట్ చేయరేంటని బాధితురాలి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సందీప్ ఘోష్ చెప్పిన వివరాల ఆధారంగా మరోసారి సీబీఐ అధికారుల ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హాస్పిటల్‌లోని నాలుగో అంతస్తులో ఉన్న సెమినార్‌ హాల్‌లో ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని తనిఖీలు చేశారు. ఇప్పటి వరకూ ఈ కేసులో సంజయ్ రాయ్‌ని తప్ప మరెవరినీ అరెస్ట్ చేయలేదు. నిందితుడిని ఉరి తీయాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ హత్యాచారం వెనక డ్రగ్ రాకెట్‌ ఉందన్న అనుమానాలున్నాయి. ఈ కేసులో ఎన్నో ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకాల్సి ఉంది. 


Also Read: Kolkata: మొబైల్ నిండా అశ్లీల వీడియోలు, ఆడవాళ్లు కంటపడడమే పాపం - కోల్‌కతా హత్యాచార నిందితుడి షాకింగ్ బ్యాగ్రౌండ్‌