Kolkata Doctor Case Accused: కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. సైకో అనాలసిస్ టెస్ట్‌లూ చేస్తున్నారు. ఓ మనిషి ఇంత పాశవికంగా ఎలా ప్రవర్తిస్తాడు..? అసలు ఎవరీ వ్యక్తి అని ఆరా తీస్తే ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన జరిగినప్పుడు తెల్లవారుజామున 4 గంటలకు సంజయ్ రాయ్ మెడలో బ్లూటూత్‌ ఇయర్ ఫోన్స్‌ వేసుకుని హాస్పిటల్‌లోకి వచ్చాడు. అక్కడి సీసీ కెమెరాలోనూ ఇది రికార్డ్ అయింది. ఆ తరవాత ఘటనా స్థలంలో ఇదే బ్లూటూత్‌ డివైజ్ కనిపించింది. దీని ఆధారంగానే సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. 


ఎవరీ సంజయ్ రాయ్..?


2019 నుంచి కోల్‌కతా పోలీస్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ గ్రూప్‌లో సివిక్ (Whos is Sanjay Roy) వాలంటీర్‌గా పని చేస్తున్నాడు సంజయ్ రాయ్. ఆ తరవాత ఈ హాస్పిటల్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. నెలకి రూ.12 వేల జీతానికి ఈ ఉద్యోగం చేస్తున్నాడు. చేసేది వాలంటీర్ పనైనా పోలీస్‌లానే కనిపించే వాడు. పోలీస్ టీషర్ట్ వేసుకుని అందరినీ బెదిరించేవాడు. హాస్పిటల్‌కి వచ్చే పేషెంట్స్ నుంచి డబ్బులు వసూలు చేసి వాళ్లకి బెడ్‌ ఇస్తానని చెప్పేవాడు. అంతే కాదు. హాస్పిటల్‌లో జరిగే భారీ రాకెట్స్‌లో సంజయ్ రాయ్ హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం చూస్తే..ఈ హత్య తానే చేసినట్టు పోలీసుల ముందు అంగీకరించాడు. ఈ క్రమంలోనే కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంజయ్ రాయ్ మొబైల్‌ నిండా అశ్లీల వీడియోలున్నాయి. వీటితో పాటు మరి కొన్ని హింసాత్మక వీడియోలూ ఉన్నాయని గుర్తించారు. హత్య చేశానన్న భయం కానీ, పశ్చాత్తాపం కానీ అతనిలో కనిపించడం లేదని తెలుస్తోంది. "నేనేం తప్పు చేయలేదు. అవసరమైతే ఉరి తీసుకోండి" అని పోలీసులకు తేల్చి చెప్పినట్టు స్థానిక మీడియా ద్వారా తెలిసింది. 


బ్యాగ్రౌండ్ ఇదీ..


ఈ నిందితుడి బ్యాగ్రౌండ్‌ కూడా షాకింగ్‌గానే ఉంది. ఇప్పటికి నాలుగు సార్లు పెళ్లిళ్లు చేసుకున్నాడు. చిత్రహింసలకు గురి చేస్తుండడం వల్ల ముగ్గురు భార్యలు విడిచి పెట్టి వెళ్లిపోయారు. గతేడాది నాలుగో భార్య క్యాన్సర్‌తో చనిపోయింది. సంజయ్ రాయ్‌ గురించి తెలిసిన వాళ్లంతా అతని ప్రవర్తన దారుణంగా ఉంటుందని, మహిళలను హింసిస్తాడని చెబుతున్నారు. రోజూ ఫుల్‌గా తాగి అర్ధరాత్రి ఇంటికి వస్తాడని అంటున్నారు. అయితే..సంజయ్ రాయ్ తల్లి మాత్రం తన కొడుకు అమాయకుడు అని వాదిస్తోంది. కావాలనే పోలీసులు ఈ కేసులో ఇరికించారని ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది. మాజీ ప్రిన్సిపల్‌కి ఈ హత్యతో సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు అధికారులు. హాస్పిటల్‌లో భారీ డ్రగ్ రాకెట్ నడుస్తోందన్న వాదనల కారణంగా దానిపైనా దృష్టి సారించారు. నిందితుడిని ఉరి తీయాల్సిందేనంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. 


Also Read: Kolkata: కోల్‌కత్తా డాక్టర్ డైరీలో ఏం రహస్యాలున్నాయి? చిరిగిపోయిన పేజీయే కీలక సాక్ష్యం కానుందా?