Cyber Crime With New Year 2025 Wishes : హైదరాబాద్:  'నూతన సంవత్సర శుభాకాంక్షల' పేరుతో ఉన్నదంతా దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు  ప్లాన్ వేశారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ చేశారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి చేతికి చిక్కి ఖాతాలు ఖాళీ చేసుకోవడమే కాదు, ఫోన్లలో ఉన్న వ్యక్తి గత సమాచారం అంతా పోగొట్టుకోవాల్సి వస్తుందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (Sajjanar) హెచ్చరించారు.

Continues below advertisement


పొరపాటున లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతి


న్యూ ఇయర్ విషెస్ చిత్రాలు, సందేశాలను మీ పేరుతో సహా తయారు చేసుకొని ఇతరులకు పంపవచ్చని, ఇందుకోసం ఈ కింది లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని స్మార్ట్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నారు. పొరపాటున వాటిపై క్లిక్ చేశారంటే తిప్పలు తప్పవు. ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్(ఏపీకే) ఫైల్స్ రూపంలో పంపే ఈ గూఢచర్య అప్లికేషన్ ఒకసారి ఫోన్లోకి జొరబడిందంటే అందులోని సమస్త సమాచారం నేరగాళ్ల అధీనం లోకి వెళ్లిపోతుంది. 


 బ్యాంకు ఖాతాల వివరాలు, ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్ నంబర్లు, ఇతర ఫైల్స్ అన్నీ తీసేసుకుంటారు. కాబట్టి నూతన సంవత్సర సందేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే పెద్ద ఎత్తున సందేశాలు పంపుతున్న సైబర్ కేటుగాళ్లు రాబోయే రెండు, మూడు రోజుల్లో తమ దాడుల్ని తీవ్రతరం చేసే అవకాశం ఉంది.. జాగ్రత్త!!’ అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రాష్ట్ర ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించి అప్రమత్తం చేశారు.



Also Read: Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం