Telangana Govt Announces 7 Day Mourning in Honour For former PM Manmohan Singh | హైదరాబాద్‌: భారత మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కన్నుమూశారు. దేశ వ్యాప్తంగా మన్మోహన్ సింగ్ మృతిపై సంతాపం తెలుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మన్మోహన్ ఆర్థిక సంస్కరణల్ని గుర్తుచేసుకుంటున్నారు. మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. మన్మోమన్ సింగ్ మృతిపై వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని తెలంగాణ సీఎస్ శాంతి కుమారి గురువారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్ధిక వేత్త, మహా నాయకుడు, సంస్కరణ వాది అని తెలంగాణ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఒక గొప్ప కుమారుడిని కోల్పోయిందని. మన్మోహన్ సింగ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. మాజీ ప్రధాని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నవ భారత శిల్పుల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. రాజకీయ, ప్రజా జీవితంలో గౌరవ మర్యాదలు ఎలా పాటించాలో ఆయనను చూసి నేర్చుకోవాలి. నిర్ణయాలలో సమగ్రత, పారదర్శకత అన్నింటికీ మించి మానవీయ స్పర్శను జోడించేవారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.






 ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని గాడిన పెట్టారు
ఆర్థిక శాఖ మంత్రిగా, ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు దేశం ఏ నాటికి మరిచిపోదు. ఆయన ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన ఆర్థిక సంస్కరణలతో బలోపేతం చేసిన మహనీయులు మన్మోహన్ సింగ్. యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక విప్లవాత్మకమైన చట్టాలు తెచ్చి అమలు చేసిన గొప్ప నేత. క్రమశిక్షణ కు మారు పేరు, చేతల మనిషిగా పేరుగాంచిన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.



దేశం గొప్ప ఆర్థిక నిపుణుడిని కోల్పోయింది
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంతాపం ప్రకటించారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా, పలు ఆర్థిక సంస్కరణల పితామహుడిగా ఆయన చేసిన సేవలను ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదు. దేశం ఒక గొప్ప ఆర్థిక నిపుణుడిని కోల్పోయింది. ప్రపంచీకరణతో భారత్ ను తిరుగులేని శక్తిగా మార్చారు. ప్రధాని పీవీ హయాంలో ఆర్థిక మంత్రిగా దేశాన్ని ఒక కొత్త దిశ వైపు నడిపించిన గొప్ప ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్. దేశ వ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసిన ఘనుడు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామీణ పేదల జీవితాల్లో మార్పు తెచ్చారు. 


Also Read: Manmohan Singh Death: మన్మోహన్ సింగ్‌ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం