7 day mourning in honour of former PM Manmohan Singh | న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూయడం తెలిసిందే. దేశం ఓ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, గొప్ప మేధావిని, చేతల మనిషిని కోల్పోయింది. మన్మోహన్ సింగ్ మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా, ఇతర రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో దేశ వ్యాప్తంగా డిసెంబర్ 26 నుంచి జనవరి 1వ తేదీ వరకు 7 రోజులపాటు సంతాప దినాలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ లాంఛనాలతో శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి.
నేడు కేబినెట్ భేటీలో సంతాపం
మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ మండలి శుక్రవారం ఉదయం 11 గంటలకు భేటీ కానున్నట్లు సమాచారం. ఈ కేబినెట్ భేటీలో దివంగత ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతికి కేంద్ర మంత్రివర్గం సంతాపం తెలపనుంది. దేశం కష్టాల్లో ఉన్న సమయంలో తన ఆర్థిక విధానాలతో కొత్త పుంతలు తొక్కించిన మన్మోహన్ అంటే అన్ని పార్టీలకు ఇష్టమే. ఆయనను గొప్ప మేథావిగా, ఆర్థిక చాణక్యుడిగా పేర్కొంటారు. కాగా, మన్మోహన్ సింగ్‌కు భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
గత కొన్నేళ్లుగా వయసురీత్యా అనారోగ్య కారణాలతో మన్మోహన్ సింగ్ ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమలో గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన మన్మోహన్ సింగ్‌ను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. కానీ వైద్యుల ఫలితాలు ప్రయత్నించలేదు, ఆయన శరీరం వైద్యానికి సహకరించకపోవడంతో మన్మోహన్ తుదిశ్వాస విడిచారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి 9.51 గంటలకు కన్నుమూశారని ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు.
దేశాన్ని నిలబెట్టిన మన్మోహన్ ఆర్థిక సంస్కరణలు
1990వ దశకం భారత్‌కు గడ్డు కాలం. కానీ పీవీ నరసింహారావు ప్రభుత్వంలో 1991 నుంచి 1996 వరకు ఆర్థిక మంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్ తన మేథస్సుతో దేశాన్ని పెద్ద గండం నుంచి గట్టెక్కించారు. ప్రధానిగా ఆ సమయంలో పీవీకి ఎంత ప్రాధాన్యత దక్కిందో, ఆ ఆర్థిక సంస్కరణల నిర్ణయాలు తీసుకున్న ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌ను అంతే స్మరించుకుంటున్నాం. అపార మేధావి, ఆర్థిక నిపుణుడు అయిన మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు ప్రధానిగా యూపీఏ సర్కార్‌ను నడిపించారు. నెహ్రూ, గాంధీయేతర కుటుంబాల నుంచి పదేళ్లపాటు ప్రధానిగా సేవలు అందించిన తొలి నేతగా మన్మోహన్ నిలిచారు.