భద్రాచలం పట్టణంలో సినిమా ఛేజింగ్‌ను తలపించేలా ఓ ఘటన జరిగింది. రాత్రివేళలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ కారు స్పీడుగా వచ్చి ఎక్సైజ్ శాఖ వాహనాన్ని ఢీ కొట్టి మరి పారిపోవాలని భావించాడు. చివరకు చేజింగ్‌లో తప్పించుకోవాలని యత్నించి, చివరికి కారు వదిలి పారిపోయాడు నిందితుడు. అయితే కారులో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేయడంతో అందులో 380 కేజీల గంజాయి లభించింది. సినిమా ఛేజింగ్ తరహాలో భద్రాచలంలో జరిగిన ఈ సంఘటనలకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ ఎక్సైజ్ సీఐ రహీమున్నిసాబేగం ఆధ్వర్యంలో సిబ్బంది కూనవరం రోడ్‌లో తనిఖీలు చేపట్టారు. ఏపీ నుంచి భద్రాచలం వైపుగా స్పీడుగా వచ్చింది. పోలీసుల తనిఖీని గమనించిన వాహనంలోని వ్యక్తులు అతివేగంగా వచ్చి ఎక్సైజ్ పోలీస్ వాహనాన్ని ఢీకొట్టారు. అక్కడ్నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయితే అప్రమత్తమైన ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ అలీమ్, నరేందర్, జమాల్‌తోపాటు కానిస్టేబుళ్లు వాహనాన్ని వెంబడించారు.
తెల్లవారుజామున సినీ పక్కీలో చేజింగ్..
కూనవరం రోడ్‌లో ఎక్సైజ్ పోలీసుల వాహనాన్ని ఢీకొట్టి పరారయ్యేందుకు ప్రయత్నించిన దుండగులు భద్రాచలం పట్టణంలో సుమారు కిలోమీటర్ మేరకు స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ప్రధాన రహదారిపై వస్తే ఎలాగైనా పోలీసులకు చిక్కుతామని భావించి గోదావరి బ్రిడ్జి వద్దకు రాగానే వాహానాన్ని భద్రాచలం దేవాలయం వైపు మళ్లించారు. అయితే తనిఖీల సమయంలో తమ వాహనాన్ని ఢీకొట్టి అతివేగంగా వెళ్లిన కారును ఎలాగైనా పట్టుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు వారిని వెంబడించడంతో కారును వదిలేసి దుండగులు పరారయ్యారు.
అనుమానం వచ్చిన ఎక్సైజ్ శాఖ అధికారులు కారును పరిశీలించగా అందులో రూ.90 లక్షల విలువ చేసే 380 కేజీల గంజాయి లభ్యమైంది. అయితే కారు జార్ఖండ్ రాష్ట్రానికి చెందినదిగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. తెల్లవారుజామున సినీ పక్కిలో జరిగిన ఛేజింగ్ స్థానికులను ఆశ్చర్యానికి గురిచేశారు. అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతంగా భద్రాచలం ఉండటంతో ఈ ప్రాంతం నుంచే గంజాయి అక్రమ రవాణా చేసేందుకు దుండగులు వినియోగించుకుంటున్నారు. ఏది ఏమైనా తమ వాహనాన్ని ఢీకొట్టినప్పటికీ చాకచక్యంగా పోలీసులు గంజాయి కారును చేజ్ చేయడం పట్ల ఎక్సైజ్ ఉన్నతాధికారులు సిబ్బందిని అభినందించారు.
Also Read: Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్