అమెరికాలో పసిపిల్లలకు ఇప్పుడు ఫార్ములా మిల్క్ దొరకడం లేదు. ట్రంప్ హయాంలో ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతలుపై భారీగా పన్నులు విధించారు. ఆ ప్రభావంతో పాటు ఇటీవల బైడెన్ సర్కార్ ఫార్ములా మిల్క్ తయారు చేసే కంపెనీలకు మరిన్ని కష్టాలు తెచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. దాంతో ఫార్ములా మిల్క్ ఉత్పత్తి, దిగుమతులు పూర్తిగా తగ్గిపోయాయి. ఫలితంగా అమెరికాలో ఎక్కడ చూసినా ఫార్ములా మిల్క్ కొరత కనిపిస్తోంది. 
 
అమెరికాలో  నెలలు నిండకనే పుట్టిన బిడ్డలు ఎక్కువగా ఉన్నారు.  ఆధునిక జీవనశైలి దుష్ప్రభావాల వల్ల తల్లుల్లో పాల కొరత ఏర్పడుతోంది. డ్రగ్స్‌, మద్యం, ధూమపానం, వేళాపాలలేని పనివేళలు, ఊబకాయం కలిగిన మహిళల్లో పాల ఉత్పత్తి తగ్గుతోంది. అందులోనూ నగరాల్లోని తల్లులు ఉద్యోగినులు కావడం వల్ల.. తీవ్రమైన మానసిక ఒత్తిళ్ల మధ్య పిల్లలకు పాలు పట్టలేకపోతున్నారు. ఇటువంటి కారణాల చేత ఎక్కువ మంది తమ పిల్లలకు ఫార్ములా మిల్క్‌నే అలవాటు చేస్తున్నారు.  అమెరికాలోని మిలియన్ల కుటుంబాలు తమ చిన్నారుల కోసం ఈ ఫార్ములాపైనే ఆధారపడుతుంటాయి. 



అయితే ప్రస్తుతం ఈ ఫార్ములా మిల్క్‌ కొరత ఏర్పడటంతో  పసిగుడ్డుల ఆకలి ఎలా తీర్చాలో తెలియక తల్లఢిల్లీపోతున్నారు.  అమెరికాలో ఫార్ములా మిల్క్ కొరత పెద్ద సంక్షోభానికి దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో బైడెన్ తక్షణం  జోక్యం చేసుకుని కంపెనీలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఇతర దేశాల నుంచి దిగుమతులను ప్రోత్సహిస్తున్నారు. 



అమెరికాలో తల్లి పాల బ్యాంకులు ఉన్నాయి. అవి కూడా వీలైనంతగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాయి కానీ.. డిమాండ్ అధికంగా ఉండటంతో సాధ్యం కావడం లేదు.