Khammam News: ఆయా అంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిది. అమ్మకు వేరే పనులు ఉండి కుదరకపోయినా పిల్లలను చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత ఆమెపై ఉంటుంది. కానీ ఆ ఆయానే ఆ పాప పాలిట రాక్షసిలా మార్చింది. అభంశుభం తెలియని ఆ చిన్నారిపై అరాచకంగా దాడి చేసింది. తన ఇంట్లో ఉన్న పిల్లలు గుర్తుకు వస్తే ఆమె ఇంతటి దారుణానికి ఒడిగట్టేది కాదేమో.. కానీ పాపపై కోపాన్ని మనసంతా నింపుకొని సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. ఈ అమానుష ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలంలో చోటు చేసుకుంది. 


అసలేం జరిగిందంటే?


ఖమ్మం జిల్లా మధిర శివాలయం రోడ్డులో ఉన్న అంగన్ వాడీ కేంద్రంలో పని చేస్తున్న ఓ ఆయా... తన రాక్షసత్వాన్ని ప్రదర్శించింది. చిన్నారి తరచూ మూత్రానికి వెళ్తోందని మర్మాంగంలో గోర్లతో గాట్లు పెట్టింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన చిన్నారి తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. పాపపై ఇంతటి దారుణానికి పాల్పడిన ఆయాపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అంగన్ వాడీలో ఆయాగా పని చేస్తున్న మహిళ ఎవరూ మూత్ర విసర్జన చేసినా తరచుగా కొట్టడం, వంటివి చేస్తుందని చిన్నారి తల్లి ఆరోపిస్తోంది. అయితే మూత్ర విసర్జనకు తరచుగా వెళ్తుందన్న కోపంతోనే పాప మర్మాంగంపై గాట్లు పెట్టిందని వివరించింది. అయితే తీవ్ర రక్తస్రావం అవడంతో పాప ఇంటికి వచ్చిందని.. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లామని వివరించింది. ఇప్పటికీ పాపకు రక్తస్రావం ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి ఆయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 


కొన్ని నెలల క్రితం ఏపీలోనూ ఇలాంటి ఘటనే..


అనంతపురంలోని కొవ్వూరు నగర్ దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారి మూతిపై ఆయా వాత పెట్టింది. బాలుడు అంగన్వాడీ కేంద్రంలో ఉండకుండా అమ్మ కావాలని బయటకు వెళ్లిపోతున్నాడని అక్కడ పనిచేస్తున్న ఆయా మూడేళ్ల చిన్నారి మూతిపై వాత పెట్టి తీవ్రంగా గాయపడింది. కొవ్వూరు నగర్‌లో లక్ష్మీదేవి, శింగారెడ్డి దంపతులు ఉంటున్నారు. వీరి మూడేళ్ల బాలుడు ఈశ్వర్‌ కృష్ణారెడ్డిని కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి పంపిస్తున్నారు. రోజూలాగే శనివారం బాలుడ్ని అంగన్వాడీలో వదిలిపెట్టి వచ్చామని తల్లి చెబుతున్నారు. బాలుడు అమ్మ కావాలని ఏడవడంతో ఆయా చెన్నమ్మ బాలుడి మూతిపై వాత పెట్టిందని తల్లి ఆరోపిస్తుంది. బాలుడి మూతిపై బొబ్బలు వచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. చిన్నారి అని కూడా చూడకుండా కర్రతో కొట్టిందని తెలిపింది. బాలుడి కాళ్లు, వీపుపై వాతలు పడి ఎర్రగా కమిలిపోయాయని తల్లి ఆవేదన చెందుతుంది. ఆయాపై చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ ఆరా తీశారు. స్థానిక అధికారులు అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. 


Also Read: Telangana Liberation Day 2022: ఆపరేషన్ పోలో అంటే ఏంటి? భారత్‌లో హైదరాబాద్ విలీనం ఎలా జరిగిందో తెలుసా !