Tamilnadu Lady Cheated In The Name Of Marriage: పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర ఘట్టం. ఒక్కసారి మూడు ముళ్లు పడితే జీవితాంతం ఒకరి కోసం ఒకరు తోడుంటామనే భరోసా కల్పిస్తుంది. అలాంటిది ఓ మహిళ పెళ్లినే ఆటగా మార్చేసింది. తాళినే ఎగతాళి చేస్తూ.. సింపుల్‌గా భర్తలను మార్చేస్తూ ఎందరి జీవితాలతోనో ఆడుకుంది. పెళ్లి అయిన తర్వాత అందినకాడికి నగలు, డబ్బుతో ఉడాయించేది. ఇలా పోలీస్ అధికారులతో సహా దాదాపు 50 మందిని మోసం చేసిన మాయలేడి ఉదంతం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. తమిళనాడులో ఈ నిత్య పెళ్లికూతురి మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది.


ఇదీ జరిగింది


పోలీసులు, బాధితుల తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు తిరువూరుకు చెందిన ఓ 35 ఏళ్ల వ్యక్తికి పెళ్లి కాకపోవడంతో వధువు కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో 'ద తమిళ్ వే' అనే వెబ్ సైట్ ద్వారా సంధ్య అనే మహిళ పరిచయమైంది. ఇద్దరూ ఇష్టపడగా.. తన తల్లిదండ్రులను ఒప్పించి మరీ ఆమెను సదరు వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. అంతా సాఫీగా సాగుతుందనుకునే టైంలో మొదటి రాత్రి తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పును గమనించిన భర్త, అతని కుటుంబ సభ్యులు సదరు మహిళ ఆధార్ కార్డు చెక్ చేశారు. అందులో భర్త పేరు వేరే ఉంది. దీనిపై ఆమెను నిలదీయగా.. చంపేస్తానంటూ భర్తనే బెదిరించింది. దీంతో సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించగా సంధ్యను అదుపులోకి తీసుకుని విచారించారు.


వెలుగులోకి షాకింగ్ నిజాలు


పోలీసుల విచారణలో సంధ్య గురించి షాకింగ్ నిజాలు తెలిశాయి. ఆమె ఇదివరకే 50 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓ డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్, మధురైలో మరో పోలీస్ అధికారి, ఓ ఫైనాన్స్ అధికారితో సహా 50 మంది ఆమె బాధితుల లిస్టులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. ఫస్ట్ నైట్ అయ్యాక గొడవపడి తర్వాత ఇంట్లోని డబ్బులు, నగలతో పరారీ అవుతుందని విచారణలో తేల్చారు. ఇలా జరిగిన తర్వాత కుటుంబం పరువు పోతుందని బాధితులు మౌనంగా ఉండిపోతున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే.. ఫోటోలు బయటపెడతానని బెదిరింపులకు దిగేదని.. ఇలా పదుల సంఖ్యలో మోసం చేసిందని పోలీసుల విచారణలో తేల్చారు. ఒక్కో పెళ్లికి ఒక్కో పేరుతో మోసం చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం నిత్య పెళ్లికూతురిని అదుపులోకి తీసుకున్న తిరుపూర్ పోలీసులు విచారిస్తున్నారు.


Also Read: HIV Cases: విద్యార్థుల్లో పెరుగుతున్న HIV కేసులు, ఇప్పటికే 47 మంది మృతి - వందలాది మందికి పాజిటివ్