Son In law Shooting On Wife Parents in Macherial: మంచిర్యాల జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. కన్నెపల్లి మండలం సాలిగామ గ్రామంలో అత్తమామలపై వారి అల్లుడు మంగళవారం అర్ధరాత్రి కాల్పులు జరిపాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోమాస నరేందర్ అనే వ్యక్తి తన మామ గోలేటి శంకర్, అత్త, భార్యపై తుపాకీతో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. వారు అతని వద్ద నుంచి తప్పించుకొని పారిపోయారు. నరేందర్ కరీంనగర్ లోని ఓ విస్తరాకుల కంపెనీలో పని చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా అదనపు కట్నం కోసం భార్యను వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం భార్యను అదనపు కట్నం తేవాలని కొట్టి ఇంటికి పంపాడు. మంగళవారం సాయంత్రం సాలిగాంకు వచ్చిన నరేందర్ భూమి అమ్మి డబ్బులు చెల్లించాలని భార్య, అత్తమామలపై ఒత్తిడి చేశాడు. వారు వినకపోవడంతో వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో వారు అతని నుంచి తప్పించుకుని పారిపోయారు. ఈ కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. వారు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి కోసమే తమ అల్లుడు నరేందర్ తమపై కాల్పులు జరిపాడని అత్తమామలు తెలిపారు. బుల్లెట్లు గోడకు తగిలాయని.. తాము ప్రమాదం నుంచి బయటపడ్డామని అన్నారు. కాల్పులు జరిపిన అనంతరం నరేందర్ పారిపోయాడని వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తున్నట్లు ఏసీపీ రవికుమార్ పేర్కొన్నారు.


Also Read: Bandi Sanjay: బండి సంజయ్‌పై కోడి గుడ్లతో దాడి, పోలీసులపై ఆగ్రహం